LPG కి ప్రత్యామ్నాయంగా నయా ఇంధనం.. కేంద్రం మాస్టర్ ప్లాన్!
పెట్రోల్‌లో ఇథనాల్ కలిపి చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకుంటున్న భారత్, ఇప్పుడు అదే ఫార్ములాను వంట గదిలోకి కూడా తీసుకురావాలని యోచిస్తోంది. దేశంలో పేరుకుపోయిన భారీ బయోఇంధన నిల్వలను దృష్టిలో ఉంచుకుని, దాదాపు 1,000 కోట్ల లీటర్ల అదనపు ఇథనాల్‌ను వాణిజ్య వంట అవసరాలకు మళ్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై రానున్న వారాల్లో ఒక వివరణాత్మక 'శ్వేతపత్రాన్ని' (White Paper) అంతర్-మంత్రిత్వ శాఖల కమిటీకి సమర్పించనున్నారు.
ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనను గృహ వినియోగానికి కాకుండా, పెద్ద ఎత్తున వంట గ్యాస్ వాడే హోటళ్లు, రెస్టారెంట్లు మరియు విమానాశ్రయాల్లో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ఎల్‌పీజీ దిగుమతులు కష్టతరంగా మారడంతో, చమురు సంస్థలు గృహ వినియోగానికి ప్రాధాన్యతనిచ్చి వాణిజ్య రంగానికి సరఫరాను తగ్గిస్తున్నాయి. ఈ లోటును పూడ్చడానికి ఇథనాల్ ఒక అద్భుతమైన 'క్లీన్ ఫ్యూయల్'గా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఖర్చు తక్కువ.. భద్రత ఎక్కువ!
వాణిజ్య ఎల్‌పీజీ ధరలతో పోలిస్తే ఇథనాల్ చాలా తక్కువ ధరకే లభించనుంది. వాణిజ్య ఎల్‌పీజీ కిలో ధర సుమారు రూ.103 ఉండగా, హైడ్రస్ ఇథనాల్ ధర కేవలం రూ.70 మాత్రమే. గడిచిన కొన్నేళ్లలో భారత్ దాదాపు రూ.40,000 కోట్ల పెట్టుబడులతో తన ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 2,000 కోట్ల లీటర్లకు పెంచుకుంది. ఇందులో పెట్రోల్ మిశ్రమానికి పోగా 1,000 కోట్ల లీటర్లు అదనంగా మిగులుతున్నాయి. ఇథనాల్ దహన ప్రక్రియలో హానికర ఉద్గారాలు విడుదల కావు, ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది.
రైతులకు వరప్రదాయిని
చెరకు, మొక్కజొన్న, విరిగిన బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుండి ఇథనాల్ తయారవుతుంది. వంట ఇంధనంగా ఇథనాల్ వినియోగం పెరిగితే, పెట్రోలియం కంపెనీల నుంచి రైతులకు నేరుగా మేలు జరుగుతుంది. ఇది కేవలం ఇంధన భద్రతను పెంచడమే కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి దోహదపడుతుంది.
ఎల్‌పీజీ కంటే ఇథనాల్‌కు తక్కువ కెలోరిఫిక్ విలువ (7,100 కేలరీలు) ఉన్నప్పటికీ, దాని ధర మరియు లభ్యత పరంగా చూస్తే ఇది వాణిజ్య రంగానికి లాభదాయకమని 'ఆల్ ఇండియా డిస్టిల్లర్స్ అసోసియేషన్' (AIDA) పేర్కొంది. పెట్రోలియం, రవాణా, ఆహార శాఖలతో కూడిన బృందం సాంకేతిక సాధ్యాసాధ్యాలను అంచనా వేసిన తర్వాత, ఈ సరికొత్త ఇంధన విప్లవం పట్టాలెక్కనుంది.














Click it and Unblock the Notifications