ప్రముఖ టీవీ యాంకర్ దారుణ హత్య!
పాకిస్తాన్ మీడియా రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఘటనలో ప్రముఖ టీవీ యాంకర్, న్యూస్ ప్రెజెంటర్ రాబియా ఎహసాన్(41) కాల్చి హత్య చేయబడ్డారు. రావల్పిండిలోని గుల్హనాబాద్ ప్రాంతంలో ఉన్న ఆమె నివాసంలోనే ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ హత్యకు సంబంధించి ఆమె భర్త ఎహసాన్ తాహిర్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడా?
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఘటన జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఎహసాన్ తాహిర్ ఖాన్ తుపాకీతో కాల్పులు జరిపినట్లు అంగీకరించినప్పటికీ.. అందులో ఓ వింత ట్విస్ట్ ఇచ్చాడు. తుపాకీని క్లీన్ చేస్తున్న సమయంలో అది లోడ్ అయి ఉందనే విషయం తెలియక ప్రమాదవశాత్తు మిస్ ఫైర్ అయిందని అతడు పోలీసులకు వెల్లడించాడు. ఇంట్లో పనిచేసే పనిమనిషి కూడా పోలీసులకు ఇదే విషయాన్ని వెల్లడించడం గమనార్హం. అయితే ఇది ప్రమాదమా లేక పథకం ప్రకారం జరిగిన హత్యనా అనే కోణంలో పంజాబ్ ఫోరెన్సిక్ సైన్స్ ఏజెన్సీ బృందం ఆధారాలు సేకరిస్తోంది.

ఎవరీ రాబియా ఎహసాన్?
41 ఏళ్ల రాబియా ఎహసాన్ పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ ప్రైవేట్ న్యూస్ ఛానెల్ '92 న్యూస్'లో యాంకర్‌గా, కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ హోస్ట్‌గా సుపరిచితులు. సీనియర్ జర్నలిస్టులు ఆమిర్ మతీన్, రవూఫ్ క్లాస్రాతో కలిసి ఆమె అనేక ప్రజాదరణ పొందిన షోలు నిర్వహించారు. ఆమెకు 13, 11 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో పిల్లలు తమ అమ్మమ్మతో కలిసి ఇంటి ప్రాంగణంలో ఆడుకుంటున్నట్లు సమాచారం.
ఫస్ట్ లేడీ ఆసిఫా భుట్టో దిగ్భ్రాతి
ఈ దారుణ హత్యపై పాకిస్తాన్ ఫస్ట్ లేడీ ఆసిఫా భుట్టో-జర్దారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి పారదర్శకమైన, సమగ్రమైన విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఆమె ఆదేశించారు. అలాగే ఒకే మెట్రోపాలిటన్ ప్రాంతంలో పనిచేసే మహిళలపై ఇలాంటి దాడులు రిపీట్ కావడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది ఆగస్టులో రావల్పిండిలోని తన నివాసంలోనే 45 ఏళ్ల డిజిటల్ మీడియా ఎగ్జిక్యూటివ్ హినా జావేద్ కూడా అనుమానాస్పద స్థితిలో దారుణంగా హత్యకు గురైన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు.














Click it and Unblock the Notifications
