గ్యాస్ మన దగ్గరే చౌకట! జనాలపై భారం లేదంటున్న కేంద్రం..
అంతర్జాతీయ మార్కెట్‌లో వంట గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ, పొరుగు దేశాలు, ప్రపంచ అగ్రరాజ్యాలతో పోలిస్తే భారతదేశంలోనే గ్యాస్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా దిగుమతి వ్యయం భారీగా పెరిగినప్పటికీ, సామాన్యులపై భారం పడకుండా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కీలక చర్యలు చేపట్టింది. ఈ మేరకు జూన్ 7న మంత్రిత్వ శాఖ ఒక ముఖ్యమైన ప్రకటనను విడుదల చేసింది.
పశ్చిమ ఆసియాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. దీని ప్రభావంతో దేశీయంగా ఎల్పీజీ (LPG) ధరలను సిలిండర్‌కు సుమారు రూ.29 మేర పెంచాల్సి వచ్చింది. ప్రస్తుత సవరించిన రేట్ల ప్రకారం, ఢిల్లీలో సాధారణ వినియోగదారులు రూ.942 కే సిలిండర్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇక 'ప్రధాన మంత్రి ఉజ్వల యోజన' (PMUY) లబ్ధిదారుల విషయానికి వస్తే.. వారికి సంవత్సరానికి మొదటి నాలుగు రీఫిల్స్‌పై లభించే సబ్సిడీని పరిగణనలోకి తీసుకుంటే, ఒక్కో సిలిండర్ సుమారు రూ.642 రూపాయలకే లభిస్తుంది. ప్రాంతాల వారీగా పంపిణీ వ్యయాల్లో ఉండే స్వల్ప వ్యత్యాసాల వల్ల రిటైల్ ధరలలో స్వల్ప మార్పులు ఉండవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ప్రపంచ దేశాల కంటే మనదగ్గరే చౌక!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వంట గ్యాస్ ధరలతో పోలిస్తే భారతదేశంలో ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు, మన పొరుగు దేశాలైన పాకిస్థాన్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర సుమారు రూ.1,046, నేపాల్‌లో రూ.1,207, బంగ్లాదేశ్‌లో రూ.1,225, శ్రీలంకలో రూ.1,241 గా ఉంది. ఇక ప్రపంచ అగ్రరాజ్యాల విషయానికి వస్తే, అమెరికాలో రూ.1,755, ఆస్ట్రేలియాలో రూ.1,765, కెనడాలో ఏకంగా రూ.2,411 వరకు వంట గ్యాస్ ధరలు ఉన్నాయి.
భారీగా పెరిగిన 'సౌదీ కాంట్రాక్ట్ ప్రైస్'
భారతదేశం తన ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ ధరలు సౌదీ అరామ్‌కో నిర్ణయించే 'సౌదీ కాంట్రాక్ట్ ప్రైస్' (Saudi CP) పై ఆధారపడి ఉంటాయి. పశ్చిమ ఆసియా పరిణామాల వల్ల ఈ బెంచ్‌మార్క్ వేగంగా పెరిగింది. ఫిబ్రవరిలో టన్నుకు 543 డాలర్లుగా ఉన్న సౌదీ సిపి ధర, హార్ముజ్ జలసంధి మూసివేత తర్వాత, ఏప్రిల్ నాటికి 775 డాలర్లకు, జూన్ నాటికి 790 డాలర్లకు ఎగబాకింది. అంటే ఫిబ్రవరితో పోలిస్తే బెంచ్‌మార్క్ ధర సుమారు 46 శాతం పెరిగింది.
సామాన్యుడి కోసం రూ.700 భారం భరిస్తున్న ప్రభుత్వం
ప్రస్తుత జూన్ నాటి కాంట్రాక్ట్ ధరల ప్రకారం, ఒక 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ అసలు సరఫరా వ్యయం రూ.1,600 దాటింది. కానీ సాధారణ వినియోగదారుడికి ఇది రూ.942 కే అందుతోంది. అంటే మార్కెట్ ధరతో పోలిస్తే సుమారు రూ.700 తక్కువ ధరకే సిలిండర్ లభిస్తోంది. ఈ అండర్-రికవరీ (భారాన్ని) ప్రభుత్వమే స్వయంగా భరిస్తోంది. హోటళ్లు వాడే 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,113.50 (కిలోకు సుమారు రూ.164) గా ఉండగా, గృహ వినియోగదారులు కిలోకు సుమారు రూ.66 మాత్రమే చెల్లిస్తున్నారు.
కొరత లేకుండా పటిష్ట చర్యలు
ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు వాటా కలిగిన 'హార్ముజ్ జలసంధి' సంక్షోభం వల్ల దాదాపు మూతపడింది. భారతదేశం దిగుమతి చేసుకునే ఎల్పీజీలో 54 శాతం ఈ మార్గం ద్వారానే వస్తుంది. అయినప్పటికీ, భారతీయ నౌకలు సమన్వయంతో రవాణాను కొనసాగించి దేశంలో ఇంధన కొరత రాకుండా చూశాయి. సరఫరాను పెంచేందుకు దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని 32 టిఎంటి (TMT) నుంచి 52 టీఎంటీకి (60 శాతానికి పైగా) పెంచారు. అలాగే అమెరికా, కెనడా, అల్జీరియా వంటి ప్రత్యామ్నాయ దేశాల నుంచి కూడా సరఫరాలను పెంచారు. ఆసుపత్రులు, విద్యా సంస్థల వంటి అత్యవసర విభాగాలకు గ్యాస్‌ను మొదటి ప్రాధాన్యతగా పంపిణీ చేశారు.
దుర్వినియోగానికి అడ్డుకట్ట - సబ్సిడీల విడదల
సబ్సిడీ గ్యాస్ వాణిజ్య వినియోగానికి మళ్లిపోకుండా చూసేందుకు ఓటిపి (OTP) ఆధారిత డెలివరీ వెరిఫికేషన్ ప్రక్రియను 90 శాతానికి పెంచారు. వినియోగదారులను పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వైపు మళ్లించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి దేశీయ ఎల్పీజీపై సంచిత అండర్-రికవరీ రూ.60,000 కోట్లకు చేరుకోగా, దీనిని భర్తీ చేసేందుకు కేంద్ర కేబినెట్ రూ.30,000 కోట్ల పరిహారాన్ని ఆమోదించింది. ఇవి కాకుండా, ఉజ్వల లబ్ధిదారులకు రూ.300 సబ్సిడీ నేరుగా వారి ఖాతాల్లోకి జమ అవుతోంది. ఈ చర్యలన్నింటి వల్లే అంతర్జాతీయంగా ధరల తీవ్రత ఉన్నప్పటికీ, భారతీయ వినియోగదారులకు అతి తక్కువ ధరకే వంట గ్యాస్ అందుతోందని మంత్రిత్వ శాఖ వివరించింది.














Click it and Unblock the Notifications