LPG: కేంద్రానికి కొత్త కష్టాలు! సామాన్యుడి గ్యాస్ సిలిండర్‌కు సబ్సిడీ భారం
దేశంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు వంటగ్యాస్ (ఎల్పీజీ) సబ్సిడీ అందించడం కేంద్ర ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో పెను సవాలుగా మారనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ మొత్తం గ్యాస్ సబ్సిడీ బిల్లు ఏకంగా రూ. 1 లక్ష కోట్లు దాటే ప్రమాదం ఉందని ప్రముఖ ఆర్థిక విశ్లేషణ సంస్థ 'పీఎల్ క్యాపిటల్' తన తాజా నివేదికలో హెచ్చరించింది.
కేంద్ర ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్‌లో కేటాయించిన నిధులకు, వాస్తవంగా అవుతున్న ఖర్చుకు మధ్య ఏకంగా రూ. 70,000 కోట్ల భారీ వ్యత్యాసం ఏర్పడనుందని ఈ నివేదిక స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు, గ్యాస్ ధరలు పెరుగుతున్నప్పటికీ, ఆ భారం వినియోగదారులపై పడకుండా కేంద్రంతో పాటు ప్రభుత్వ చమురు విక్రయ సంస్థలు (OMCs) మెజారిటీ వాటాను భరిస్తుండటమే దీనికి ప్రధాన కారణం.

లెక్క తప్పిన బడ్జెట్ అంచనాలు!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వంటగ్యాస్ సబ్సిడీ కోసం కేవలం రూ. 30,000 కోట్లుమాత్రమే కేటాయించింది. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ పరిమితి ఎప్పుడో దాటిపోయిందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్ రన్ రేట్ ప్రకారం.. సబ్సిడీ కింద సరఫరా చేసే ప్రతి గ్యాస్ సిలిండర్‌పై ప్రభుత్వం దాదాపు రూ. 490 వరకు నష్టాన్ని లేదా భారాన్ని ఓర్చుకోవాల్సి వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, అనిశ్చితి కారణాల వల్ల ఇంధన ధరలు స్థిరంగా లేకపోవడంతో.. ఈ భారం రాబోయే నెలల్లో రూ. 1 లక్ష కోట్లకు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
అన్ని రకాల సబ్సిడీలకూ రెక్కలు
కేవలం గ్యాస్ మాత్రమే కాదు.. ప్రభుత్వం అందించే ఇతర ప్రధాన సబ్సిడీల ఖర్చు కూడా గడిచిన ఏడాది కంటే భారీగా పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. 2026 ఏప్రిల్-మే నెలల కాలానికి గానూ ప్రధాన సబ్సిడీల మొత్తం వ్యయం రూ. 75,540 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది ఏకంగా 47 శాతం పెరగడం గమనార్హం.
- ఆహార సబ్సిడీ కోసం గత ఏడాది రూ. 27,990 కోట్లుగా ఉంటే, ఈసారి 46 శాతం పెరిగి రూ. 40,800 కోట్లకు చేరింది.
- ఎరువుల సబ్సిడీ రూపంలో యూరియా రాయితీ 50 శాతం పెరిగి రూ. 28,450 కోట్లకు, ఇతర పోషక ఆధారిత ఎరువుల సబ్సిడీ 39 శాతం పెరిగి రూ. 6,010 కోట్లకు చేరింది.
- పెట్రోలియం సబ్సిడీకి గత ఏడాది సున్నాగా ఉన్న ఈ ఖర్చు, ఈ రెండు నెలల్లోనే రూ. 280 కోట్లుగా నమోదైంది.
అభివృద్ధి పనులపై ప్రభావం చూపే అవకాశం?
ఒకవైపు సబ్సిడీల భారం కొండలా పెరిగిపోతుండటంతో, ప్రభుత్వం తన ద్రవ్య లోటును (Fiscal Deficit) అదుపులో ఉంచుకోవడానికి సరికొత్త వ్యూహాలను అనుసరించే అవకాశం ఉంది. మార్కెట్ నుంచి అప్పులు ఎక్కువగా తీసుకోకుండా మేనేజ్ చేయాలని భావిస్తుండటంతో.. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల ఖర్చు విషయంలో ప్రభుత్వం కొంత ఆచితూచి అడుగులు వేయవచ్చని పీఎల్ క్యాపిటల్ అంచనా వేసింది. మే 2026 నాటికి అభివృద్ధి వ్యయం 13 శాతం వృద్ధితో రూ. 2.5 లక్షల కోట్లకు చేరినప్పటికీ, సబ్సిడీల ఒత్తిడి కారణంగా రాబోయే నెలల్లో కొత్త ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు కాస్త పరిమితంగానే ఉండే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications