భయాందోళనలతో వణికిన ఢిల్లీ..!!
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో పెను భూకంపం సంభవించింది. దీని తీవ్రతకు మూడు దేశాలు వణికిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్- పాకిస్తాన్- భారత్‌లల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం సంభవించినట్లు ఇప్పటివరకు వార్తలు అందలేదు. కొన్ని చోట్ల ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.
ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా రికార్డయింది. భారత్-పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో విస్తరించిన హిందుకుష్ పర్వత శ్రేణుల్లో ఈ భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత ఈ మూడు దేశాల్లోనూ కనిపించింది. ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ప్రకంపనలు నమోదయ్యాయి.

ఆఫ్ఘనిస్తాన్- హిందూకుష్ రీజియన్‌లో ఉపరితలం నుంచి 181 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. రాత్రి 9:31 నిమిషాలకు భూకంపం నమోదైనట్లు వివరించింది. దీని ప్రకంపనలు ఢిల్లీ- ఎన్సీఆర్ పరిధిలో పలు చోట్ల రికార్డయ్యాయి.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, కర్నాల్, రోహ్‌తక్, గుర్గావ్, బులంద్‌షెహర్, మీరట్‌లల్లో కనిపించింది. భూకంపం ధాటికి ఆఫ్ఘనిస్తాన్‌లో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి రోడ్ల మీదికి పరుగులు పెట్టారు. కొన్ని చోట్ల భవనాలు బీటలు వారాయి.
భూకంప తీవ్రతను పలువురు స్థానికులు తమ మొబైల్ ఫోన్లల్లో చిత్రీకరించారు. వాటి వీడియో క్లిప్పింగ్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రధాన భూకంపం తరువాత కూడా తేలికపాటి ప్రకంపనలు వరుసగా నమోదయ్యాయి. దీనితో ప్రజలు తమ ఇళ్లల్లోకి వెళ్లడానికి వెనుకాడారు. రోడ్ల మీదే గడిపారు.












Click it and Unblock the Notifications