Maha Kumbh 2025: మహాకుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం!
Maha Kumbh 2025: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. మహాకుంభమేళాలోని సెక్టార్ 18, 19ల మధ్య ఉన్న అనేక శిబిరాలు మంటల్లో చిక్కుకున్నాయి. సమాచారం అందిన వెంటనే అనేక అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడం ప్రారంభించాయి. ప్రమాద సమయంలో శిబిరాలు ఖాళీగా ఉండడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఇదిలా ఉండగా.. అగ్నిప్రమాదాల గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
అనేక శిబిరాలు దగ్ధం
కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఫిబ్రవరి 13న కూడా సెక్టార్ 18లోని హరిశ్చంద్ర మార్గ్ సమీపంలోని ఖాళీ గుడిసెల్లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను అదుపు చేశారు. దీనికి ముందు ఫిబ్రవరి 9(ఆదివారం) రాత్రి మహా కుంభమేళా ప్రాంతంలోని ఆరైల్ వైపు ఉన్న సెక్టార్ 23లో మంటలు చెలరేగగా.. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గ్యాస్ సిలిండర్ పేలడమే అగ్నిప్రమాదానికి కారణమని తెలిసింది. మహారాజా భోగ్ అనే హోటల్ లో మంటలు చెలరేగడంతో అనేక శిబిరాలు దగ్ధమైనట్లు తెలిసింది.

బూడిదైన టెంట్లు
ఫిబ్రవరి 7న మహాకుంభమేళా ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలిసింది. సెక్టార్ 18లోని శంకారాచార్య మార్గ్ లోని ఒక శిబిరంలో మంటలు చెలరేగగా.. ఈ ఘటనలో చాలా టెంట్లు కాలి బూడిదయ్యాయి. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక దళం వేగంగా స్పందించి, పెద్ద ప్రమాదం జరగకముందే మంటలను అదుపు చేసింది. జనవరి 30న మహాకుంభ్ లోని సెక్టార్-22లో అనేక శిబిరాలు మంటలకు ఆహుతయ్యాయి. ఈ అగ్నిప్రమాదంలో 15 టెంట్లు కాలి బూడిదయ్యాయి. జనవరి 19న సెక్టార్ 19లో మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక శిబిరంలో ఉంచిన ఎండుగడ్డి మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో దాదాపు 18 శిబిరాలు కాలి బూడిదయ్యాయి. అయితే అగ్నిమాపక దళం సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేయడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరు గాంచిన మహాకుంభమేళాలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మౌని అమావాస్య సందర్భంగా గతన నెల 29న కుంభమేళాలో తొక్కిసలాటలో 30 మంది మృతి చెందిన తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 60 మంది గాయపడ్డారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications