నాగసాధు, అఘోరీల అమృత్ స్నానం- అదే వారి ప్రధాన బలం
Mahakumbh 2025: మహా కుంభ మేళా 2025 అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. పండగ వాతావరణం నెలకొంది. వసంత పంచమిని పురస్కరించుకుని కోట్లాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వద్ద గంగా-యమున-సరస్వతి త్రివేణి సంగమంలో అమృత్ స్నానాలను ఆచరిస్తోన్నారు. తమ మొక్కులు చెల్లించుకుంటోన్నారు.
ఈ నెల 26వ తేదీ వరకు
కిందటి నెల 13వ తేదీన మహా కుంభమేళా ఆరంభమైన విషయం తెలిసిందే. 45 రోజుల పాటు అంటే ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగబోతోందీ అతిపెద్ద ఆధ్యాత్మికోత్సవం. దేశ విదేశాల నుంచి కోట్లాదిమంది భక్తులు పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు. త్రివేణి సంగమం ఘాట్లన్నీ కూడా పోటెత్తాయి.

వసంత పంచమి ఘడియల్లో..
ఈ తెల్లవారు జామున 4 గంటలకు వసంత పంచమి ఘడియలు ఆరంభం అయ్యాయి. ఆ వెంటనే నాగసాధులు, అఘోరీలు, వివిధ అఖాడాలకు చెందన సన్యాసులు.. అమృత్ స్నానాలు ఆచరించారు. అర్ధరాత్రి దాటిన తరువాత రెండు గంటల నుంచే వారంతా త్రివేణి సంగమం నోస్ పాయింట్ వద్దకు ఊరేగింపుగా చేరుకున్నారు.
4 నుంచి 6 గంటల వరకు 1.65 కోట్ల మంది..
4 నుంచి 6 గంటల వరకు 1.65 కోట్ల మంది అమృత్ స్నానాలను ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఈ రాత్రి వరకు ఈ సంఖ్య 10 కోట్లను దాటుతుందనే అంచనాలు ఉన్నాయి. వసంత పంచమి సందర్భంగా అమృత్ స్నాన్ చేసిన భక్తులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ శుభాకాంక్షలు తెలియజేశారు.
అఖాడాలకు చెందిన సాధువులు..
సన్యాసి (శైవం), బైరాగి (వైష్ణవం), ఉదాసీన్ అఖాడాలకు చెందిన సాధువులు పుణ్యస్నానాలను ఆచరించారు. శ్రీ పంచ్ దర్శనం, జునా అఖాడా, శ్రీ పంచాయతీ అఖాడా నిరంజనీ, శ్రీ శంభు పంచాయతీ అటల్ అఖాడా, శ్రీ పంచాయతీ అఖాడా మహానిర్వాని, శ్రీ శంభు పంచాగ్ని అఖాడ, శ్రీ పంచదర్శనం ఆవాహన్ అఖాడా, తపోనిధి శ్రీ ఆనంద్ అఖాడాకు చెందిన సన్యాసులు అమృత్ స్నానాన్ని ఆచరించిన వారిలో ఉన్నారు.
విదేశీయుల తాకిడి సైతం..
విదేశీయుల తాకిడి సైతం మొదలైంది. ఈ తెల్లవారు జామున తొలి ఘడియలోనే రష్యా, క్రొయేషియా, బ్రిటన్, ఫ్రాన్స్‌కు చెందిన పలువురు భక్తులు త్రివేణి సంగమంలో స్నానాన్ని ఆచరించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల తమకు ఉన్న గౌరవాన్ని చాటుకుంటోన్నారు.
అత్యంత పవిత్రమైనది..
మహా కుంభ మేళాలో అమృత్ స్నానాన్ని ఆచరించడాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. మకర సంక్రాంతి తొలి అమృత్ స్నాన పర్వదినం. దీని తరువాత మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘి పూర్ణిమ, మహా శివరాత్రి.. ఈ నాలుగు పుణ్య ఘడియల్లో తప్పనిసరిగా త్రివేణి సంగమ స్నానం చేయాలంటూ పురాణాల్లో ఉందని సాధవులు చెబుతున్నారు.
VIDEO | Maha Kumbh 2025: Drone visuals of saints and seers from Akharas taking holy dip in Triveni Sangam on the occasion of Basant Panchami.#MahaKumbh2025 #MahaKumbhWithPTI pic.twitter.com/MqrO5B8Vlq
— Press Trust of India (@PTI_News) February 3, 2025
మౌని అమావాస్య నాడు..
కిందట నెల 29వ తేదీన మౌని అమావాస్య నాడు మహా కుంభమేళాలో తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 30 మంది దుర్మరణం పాలయ్యారు. 60 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. ఫలితంగా వివిధ అఖాడాల ప్రతినిధులు మౌని అమావాస్య నాటి అమృత్ స్నానాలకు దూరం అయ్యారు.
మూడో విడత అమృత్ స్నానం..
ఈ ఘటన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. మూడో విడత అమృత్ స్నానం రోజైన వసంత పంచమి సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. వాహనాల రద్దీని నివారించింది. మహా కుంభమేళాకు దారి తీసే రహదారులన్నింటినీ వన్ వేగా మార్చివేసింది. ఫలితంగా వాహనాల రాకపోకలు తగ్గాయి.












Click it and Unblock the Notifications