తొక్కిసలాట తరువాత త్రివేణి సంగమం పరిస్థతి ఎలా ఉందంటే...?
Mahakumbh 2025 stampede: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న మహా కుంభ మేళా 2025లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. త్రివేణి సంగమం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 15 మంది భక్తులు మరణించినట్లు తెలుస్తోంది. దీన్ని ఇప్పటివరకు ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు.
40 మందికి పైగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తోన్నారు. ఈ ఘటన పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సమగ్ర విచారణకు ఆదేశించింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు.

త్రివేణి సంగమం నోస్ పాయింట్ వద్ద అర్ధరాత్రి దాటిన తరువాత ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇక్కడి ఘాట్ల వద్దకు వెళ్లే మార్గం మొత్తం భీతావహంగా కనిపించింది. బ్యారికేడ్లన్నీ ఎక్కడికక్కడ పడిపోయి కనిపించాయి. తొక్కిసలాట చోటు చేసుకున్న వెంటనే అధికార యంత్రాంగం శరవేగంగా స్పందించింది. క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్సుల్లో మోతీలాల్ నెహ్రూ ఆసుపత్రికి తరలించింది.
ఈ ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఆరా తీశారు. కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. ఎలాంటి సహాయ సహకారాలనైనా అందిస్తామని చెప్పారు. ప్రాణనష్టం తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ దిగ్భ్రాంతికర ఘటన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. త్రివేణి సంగమం నోస్ పాయింట్ వద్ద అమృత్, పుణ్య స్నానాలు చేయడానికి వెళ్లే ప్రయత్నం చేయొద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇతర ఘాట్ల వద్ద స్నానం ఆచరించడానికి అనువైన ఏర్పాట్లు ఉన్నాయని చెప్పారు.
మరోవంక- మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు, అమృత్ స్నానాలు యధాతథంగా కొనసాగుతున్నాయి. నోస్ పాయింట్ వద్ద కాకుండా ఇతర ఘాట్ల వద్ద భక్తులు పోటెత్తారు. భక్తిశ్రద్ధలతో పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు. నదీమ తల్లికి పూజలు నిర్వహిస్తోన్నారు. హారతులు ఇస్తోన్నారు.
ఈ అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారు జామున 6 గంటల వరకు 1.75 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలను ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ నెల 28వ తేదీ వరకు మొత్తంగా 19.94 కోట్ల మంది మహా కుంభమేళాను సందర్శించి, పుణ్యస్నానాలు చేశారని పేర్కొంది.












Click it and Unblock the Notifications