MH Elections: మహారాష్ట్రలో గెలుపెవరిదో తేల్చేసిన ఆరెస్సెస్ సర్వే..!!
మహారాష్ట్రలో హోరా హోరీ సమరంలో గెలుపెవరిది. జమిలి ఎన్నికల ప్రచారం వేళ మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎన్నికల ఫలితం పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది. మహారాష్ట్రలో రెండు ప్రధాన కూటముల మధ్య పోరు కొనసాగుతోంది. హర్యానా గుణపాఠంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. అదే హర్యానాలో బీజేపీ గెలుపు కోసం పని చేసిన ఆరెస్సెస్ మహారాష్ట్రలోనూ పని మొదలు పెట్టింది. వేలాది మీటింగ్ ల ద్వారా ప్రజలకు దగ్గరవుతోంది. ఇదే సమయంలో ఆరెస్సెస్ అంతర్గత సర్వేలో మహారాష్ట్ర ఫలితం ఏంటనేది స్పష్టత వచ్చింది.
రంగంలోకి సంఘ్ పరివార్
మహారాష్ట్రలో ఎంవీఏ, మహాయుతి కూటములు సీట్ల సర్దుబాటు పై ఒక నిర్ణయానికి వచ్చాయి. అభ్యర్ధుల ఖరారు పై తుది కసరత్తు చేస్తున్నాయి. హర్యానాలో బీజేపీ గెలుపు కోసం ఆరెస్సెస్ క్రియాశీలకంగా పని చేసింది. కార్నర్ మీటింగ్ ల ద్వారా ప్రజలకు దగ్గరవుతూ బీజేపీకి అనుకూలంగా ఓటర్లను దగ్గర చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇప్పుడు మహారాష్ట్ర లోనూ ఆరెస్సెస్ శ్రేణులు రంగంలోకి దిగాయి. ప్రజల్లో మహాయుతి కూటమికి అనుకూలంగా అభిప్రాయం కలిగేలా ప్రచారం ప్రారంభించాయి. ముందుగా బీజేపీకి ఉన్న విజయవాకాశాల పైన ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు ఆరెస్సెస్ చేసిన సర్వేలో ఆసక్తి కర ఫలితాలు వచ్చాయి.

బీజేపీ కూటమి వైపే మొగ్గు
లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎంవీఏ కు బీజేపీ కంటే అనుకూలత కనిపించింది. కానీ, ఆరెస్సెస్ అంతర్గతంగా రాష్ట్రంలో నిర్వహించిన సర్వేలో అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఇందుకు భిన్నంగా ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. అరెస్సెస్ నిర్వహించిన సర్వేలో బీజేపీ కూటికి 155- 160 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని తేలింది. అందులో బీజేపీ దాదాపు 90 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మిత్రపక్షాలుగా ఉన్న అజిత్ పవార్ ఎన్సీపీకి 25-30 స్థానాలు, షిండే శివసేనకు 40-45 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని లెక్కలు తేల్చారు. ఏ ప్రాంతంలో బీజేపీకి అనుకూల - వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయనేది ఈ సర్వేలో ఆరెస్సెస్ నేతలు గుర్తించి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.
అరెస్సెస్ ప్రచారం
మహారాష్ట్రలో ఆరెస్సెస్ ప్రతీ గ్రామంలోని ప్రతీ ఓటరును కలిసేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అయిదు నుంచి పది మంది వరకు ప్రతీ చౌరస్తాలో కలిసి వారికి మహాయుతి గెలుపు ఆవశ్యకతను వివరించి వారి మద్దతు పొందే ప్రయత్నం చేస్తోంది. హర్యానాలో అమలు చేసిన ఫార్ములాతోనే మహారాష్ట్రలో ముందుకు వెళ్తోంది. బీజేపీ కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి భవిష్యత్ .. డెవలప్ మెంట్.. ఆర్దికంగా పురోగతి .. సంక్షేమం సాధ్యం అవుతాయని వివరిస్తున్నారు. పబ్లిక్ ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారో గుర్తించి దీనికి అనుగుణంగా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో సిద్దం చేయనున్నారు. దీంతో.. హర్యానాలో బీజేపీ గెలుపులో సక్సెస్ అయిన ఆరెస్సెస్ మహారాష్ట్రలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది.. సర్వే ఏ మేర నిజం అవుతుందనేది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications