ఏక్‌నాథ్ షిండే పార్టీలో చేరిన గౌరీ లంకేష్ హత్యకేసు నిందితుడు: కీలక బాధ్యతలు
Maharashtra Assembly elections 2024: దేశంలో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలకు ముహూర్తం కుదిరింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఇటీవలే విడుదల చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్.
288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. ఒకే విడతలో పోలింగ్ పూర్తవుతుంది. అదే నెల 23వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి అదే రోజున కౌంటింగ్ ఉంటుంది. ఈ నెల 22వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ఆరంభమౌతుంది. 29వ తేదీ వరకు కొనసాగుతుంది.

30వ తేదీన నామినేషన్లను స్క్రూటినీ చేస్తారు. వాటిని ఉపసంహరించుకోవడానికి ఈసీ ఇచ్చిన గడువు నవంబర్ 4. 20వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 202. ప్రస్తుతం ఇక్కడ ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది.
2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ఈ సంఖ్యాబలాన్ని అందుకోలేకపోవడంతో ఫలితంగా శివసేన- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ- కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది గానీ అది ఎంతో కాలం మనుగడ సాగించలేకపోయింది. బీజేపీ చేపట్టిన ఆపరేషన్ కమల దెబ్బకు కుప్పకూలింది. శివసేనలో చీలికను తీసుకుని రాగలిగింది. ఉద్దవ్ థాకరే ప్రభుత్వాన్ని విజయవంతంగా కూల్చివేయగలిగింది.
శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. ఈ సారి సంపూర్ణ మెజారిటీని సాధించాలనే పట్టుదలను ప్రదర్శిస్తోన్నాయి ఆయా పార్టీలన్నీ కూడా. ఈ దిశగా అన్ని పార్టీలు తమ ప్రచార పర్వానికి తెర తీయబోతోన్నాయి.

ఈ పరిస్థితుల మధ్య ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేనలో కీలక చేరిక చోటు చేసుకుంది. కర్ణాటకలో సంచలనం సృష్టించిన మహిళా జర్నలిస్ట్ గౌరి లంకేష్ హత్యకేసు నిందితుడు శ్రీకాంత్ పంగార్కర్.. ఆ పార్టీలో రీఎంట్రీ ఇచ్చాడు. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అర్జున్ ఖోట్కర్ సమక్షంలో కండువా కప్పుకొన్నాడు.
గతంలో శివసేనలో సుదీర్ఘకాలం పని చేశాడు శ్రీకాంత్. 2001 నుంచి 2006 వరకు జాల్నా మున్సిపల్ కౌన్సిలర్‌గా పని చేశారు. 2011 నాటి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో శివసేన నుంచి బయటికొచ్చారు. హిందూ జనజాగృతి సమితిలో చేరాడు.
2017 సెప్టెంబర్ 5వ తేదీన బెంగళూరు రాజరాజేశ్వరినగరలో జరిగిన గౌరీ లంకేష్ హత్యకేసులో శ్రీకాంత్ పంగార్కర్ నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొన్నారు. 2018 ఆగస్టులో అరెస్ట్ అయ్యారు. కిందటి నెల 17వ తేదీన కర్ణాటక హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. శ్రీకాంత్‌తో పాటు భరత్ కురానె, సుజిత్ కుమార్, సుధన్వ గోంధాలేకర్ బెయిల్‌పై విడుదల అయ్యారు.
గౌరీలంకేష్ హత్యకంటే ముందు 2017లో ముంబైలో నిర్వహించిన సన్‌బర్న్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో బాంబులు పెట్టిన కేసులోనూ అరెస్ట్ అయ్యాడు. తాజాగా గౌరీ లంకేష్ హత్యకేసులో బెయిల్‌పై విడుదలైన నెల రోజుల్లోనే ఏక్‌నాథ్ షిండే వర్గం శివసేనలో జాయిన్ కావడం, అదీ అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జాల్నా అసెంబ్లీ నియోజకవర్గం ప్రచార బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించింది శివసేన అగ్రనాయకత్వం.












Click it and Unblock the Notifications