ఫిబ్రవరి 15 వరకు స్కూళ్లు, కాలేజీలు మూత: కోచింగ్ సెంటర్లు సైతం: రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ
ముంబై: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి మరోసారి ఉగ్ర రూపాన్ని దాల్చింది. కొత్త కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. భారీగా నమోదవుతున్నాయి. శనివారం నాటి బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా ఒక్కరోజు వ్యవధిలో 1,41,986 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కరోనా మహమ్మారి విరుచుకుని పడటం 222 రోజుల తరువాత ఇదే తొలిసారి. యాక్టివ్ కేసులు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. నాలుగు లక్షలను దాటేశాయి.

41 వేల కొత్త కేసులు..
అత్యధిక కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక్కడ 41,434 కొత్త కేసులు నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్, ఢిల్లీల్లో అత్యధిక కేసులు రికార్డయ్యాయి. ముంబైలోని అనేక ప్రాంతాలు కొత్త కోవిడ్ కేసులకు హాట్‌స్పాట్స్‌గా మారాయి. ఆసియాలోనే అతి పెద్ద స్లమ్ ఏరియాగా పేరున్న ధారవిలో వైరస్ విజృంభిస్తోంది. అనేక ప్రాంతాలను ఇప్పటికే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు. ఈ ప్రక్రియ మరింత ముమ్మరంగా సాగుతోంది.

నైట్ కర్ఫ్యూ సమయాలివే..
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని- మహారాష్ట్ర ప్రభుత్వం.. కీలక నిర్ణయాలను తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూను విధించింది. ఆదివారం నుంచి మహారాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారు జామున 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అలాగే- తెల్లవారు జామున 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అయిదుమంది లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడి ఉండటాన్నీ నిషేధించింది.

జూ పార్కులు సైతం క్లోజ్..
రాష్ట్రవ్యాప్తంగా స్విమ్మింగ్ పూల్స్, జిమ్, స్పా సెంటర్లు, బ్యూటీ సెలూన్లు, జూపార్కులు, మ్యూజియం, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులను మూసివేయాలని ఆదేశించింది. హెయిర్ కటింగ్ సెలూన్లు, షాపింగ్ మాల్స్ రోజువారీ కార్యకలాపాలను కొనసాగించినప్పటికీ- 50 శాతం సామర్థ్యాన్ని మించకూడదని స్పష్టం చేసింది. 50 శాతానికి మంచి సామర్థ్యం గల షాపింగ్ మాల్స్‌కు నోటీసులను జారీ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.

15 వరకు సెలవు..
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, విద్యాసంస్థలు, కళాశాలలను మూసివేసింది. సోమవారం నుంచి అవన్నీ మూత పడనున్నాయి. ఫిబ్రవరి 15వ తేదీ వరకు సెలవును ప్రకటించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, ఇండోర్ ఆడిటోరియంలల్లోనూ 50 శాతం సీటింగ్‌కు మాత్రమే అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సందర్శకులను నియంత్రించేలా ఏర్పాట్లు చేసింది. పాసులు ఉన్న వారికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపింది.

50 శాతం మందే..
పెళ్లిళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, మత ప్రార్థనలు, రాజకీయ సమావేశాల్లో 50, అంత్యక్రియలకు 20 మందికి మించకూడదని ఆదేశించింది. షాపింగ్ మాల్స్‌ను సందర్శించే 50 శాతం మంది కూడా రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకుని ఉండాలని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం పేర్కొంది. సెక్యూరిటీ గార్డులు.. ప్రతి ఒక్కరి వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను తనిఖీ చేసిన తరువాతే.. షాపింగ్ మాల్స్‌లోకి ప్రవేశించడానికి వీలు కల్పించాలని సూచించింది.

స్థానిక పరిస్థితులకు అనుగుణంగా..
రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోవచ్చని ఆయన అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని సేకరించాల్సి ఉందని చెప్పారు. మున్సిపల్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. కొత్త కేసుల సంఖ్య భారీగా నమోదైన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని ప్రాథమికంగా చర్చించామని స్పష్టం చేశారు. తమ పరిధిలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునే అధికారాన్ని మేయర్లు, మున్సిపాలిటీల ఛైర్మన్లకు ఇచ్చామని చెప్పారు.












Click it and Unblock the Notifications