గుజరాత్ ఎన్నికలు- ఉద్యోగులకు పెయిడ్ లీవ్ ఇచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం..
గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.వీటిలో దాదాపు కోటిన్నర మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోబోతున్నారు. ఇందులో గుజరాత్ తో పాటు సరిహద్దు రాష్ట్రాల్లో నివసిస్తున్న రాష్ట్ర ఓటర్లు కూడా ఉన్నారు. వీరంతా తమకు ఓటింగ్ రోజు సెలవు ఇవ్వాలని ప్రభుత్వాల్ని కోరుతున్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా మహారాష్ట్ర ప్రభుత్వం తమకు సెలవు మంజూరు చేయాలని సరిహద్దు గ్రామాల ఉద్యోగులు కోరుతున్నారు. వీరు గుజరాత్ లో ఓటర్లుగా ఉంటూ మహారాష్ట్రలో ఉంటున్న వారే. దీంతో వీరికి ఓటు వేసే హక్కు కల్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ఉద్యోగులకు ఒక్క రోజు పెయిడ్ లీవ్ మంజూరు చేస్తూ మహారాష్ట్రలోని ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉద్యోగులు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గుజరాత్ కు చెందిన ఓటర్లు మహారాష్ట్రలోని సరిహద్దు జిల్లాలైన నాసిక్, పాల్ ఘర్, నందూర్బార్, ధూలేలో పనిచేస్తున్నారు. వీరందరికీ మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఊరటనిస్తోంది. అసలే గుజరాత్ తో పాటు మహారాష్ట్రలోనూ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. అలాగే గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్, ఆప్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో సరిహద్దు జిల్లాల ఓట్లు కూడా కీలకంగా మారిపోయాయి. అందుకే మహారాష్ట్ర ప్రభుత్వం తమ ప్రాంతాల్లో పనిచేస్తున్న గుజరాత్ ఓటర్లకు ఇలా పెయిడ్ లీవ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications