వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మల్లిక శెరావత్: ‘అలాంటి హీరోలతో రాజీపడకపోవడం వల్ల చాలా అవకాశాలు పోగొట్టుకున్నా’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మల్లిక శెరావత్

బాలీవుడ్ బోల్డ్ యాక్ట్రెస్‌లలో ఒకరైన మల్లికా శెరావత్‌ చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. తాజాగా ఆమె రజత్ కపూర్ సినిమాతో మళ్లీ ఆమె స్క్రీన్‌పై కనిపించబోతున్నారు.

ఈ నేపథ్యంలో మల్లికతో 'బీబీసీ హిందీ' మాట్లాడింది. ఈ ముఖాముఖిలో ఆమె తన కెరీర్ గురించి అనేక విషయాలు పంచుకున్నారు.

రాజీపడడానికి ఇష్టపడకపోవడం వల్లే అనేక సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందని ఆమె అన్నారు.

సినిమాల్లోకి రావాలన్న తన నిర్ణయాన్ని కుటుంబం అంగీకరించకపోవడం.. అయినా, తాను ఈ దారినే ఎంచుకోవడం వంటి అనేక విషయాలను ఆమె బీబీసీతో చెప్పారు.

సినిమాల్లో నటించడానికి ఊహల్లో కూడా ఇష్టపడని కుటుంబం నుంచి తాను వచ్చానని మల్లిక చెప్పారు. వెస్ట్రన్ దుస్తులు ధరించడం, సాయంత్రాలు ఆలస్యంగా ఇంటికి చేరడం వంటివేమీ తమ కుటుంబంలో ఉండేవి కావని ఆమె గుర్తు చేసుకున్నారు.

'హరియాణాలోని ఒక సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చాను నేను. నా తల్లిదండ్రులు చాలా సంప్రదాయవాదులు. నేను వెస్ట్రన్ తరహా దుస్తులు వేసుకోవడం మా నాన్నకు ఇష్టం ఉండేది కాదు. స్నేహితులతో కలిసి రాత్రులు బయటకు వెళ్లడమూ ఆయనకు నచ్చేది కాదు. డిన్నర్‌కు బయటకు వెళ్లడానికీ అనుమతి ఉండేది కాదు. చీకటి పడకముందే ఇంటికి చేరుకోవాలని నాకు, మా సోదరుడికి ఇంట్లో నిత్యం చెప్పేవారు' అని ఆమె గుర్తు చేసుకున్నారు.

mallika shearawat

చిన్నప్పటి నుంచే వివక్ష..

చిన్నప్పటి నుంచి తనకు నటిని కావాలన్న కోరిక ఉన్నా అందుకు ఇంట్లో వాళ్ల నుంచి తీవ్ర అభ్యంతరం ఉండేదని మల్లిక చెప్పొకొచ్చారు.

'సినీ నటిని కావాలని ఏ ఆడపిల్లా కోరుకోరాదన్నది మా నాన్న అభిప్రాయం. ఆయన అభిప్రాయం ప్రకారం అమ్మాయి అంటే ఇంటి బాధ్యతలు చూసుకోవాలి, మంచి భార్యగా మసలుకోవాలి' అంటూ తన తండ్రి ఎలాంటివారో చెప్పారు మల్లిక.

తన కుటుంబ సభ్యులు ఏనాడూ తనకు అండగా నిలవలేదని, అయితే, దాని గురించి తానెప్పుడూ బాధపడలేదని మల్లిక చెప్పారు.

చిన్నప్పటి నుంచి తాను ఇంట్లో వివక్షను ఎదుర్కొన్నానని ఆమె అన్నారు.

''నేను చాలా వివక్షను ఎదుర్కొన్నాను. హరియాణాలో మగవాళ్లకు అన్ని హక్కులూ ఉంటాయి. వాళ్లు ఎలాంటి దుస్తులైనా వేసుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్లొచ్చు.. ఎంత డబ్బయినా ఖర్చు చేయొచ్చు. అబ్బాయిలు ఏం చేసినా ఇంట్లో వాళ్లు ఏం పట్టించుకోరు. బహుశా నేను తప్పు చెబుతుండొచ్చు.. కానీ, నా అనుభవం మాత్రం ఇదే చెబుతోంది'' అన్నారామె.

'నువ్వు అమ్మాయివి, నీతో ఏం లాభం’ అనేవారు..

''మా నాన్నమ్మ అయితే నా ముఖం మీదే అనేసేవారు. నువ్వు అమ్మాయివి, నీతో ఏం లాభం..అబ్బాయి అయితే కుటుంబ పేరు ప్రఖ్యాతులు పెంచుతాడు'' అంటూ తాను ఎదుర్కొన్న వివక్షను వివరించారు.

సినిమాల విషయంలో ఇంట్లోవాళ్లతో విభేదించి బయటకు వచ్చేసినప్పుడు బాలీవుడ్‌లో ఎలాగైనా స్థానం పొందాలని గట్టిగా అనుకున్నానని చెప్పారామె.

అవకాశాలు దక్కించుకోవడానికి తాను పెద్దగా కష్టపడాల్సిరాలేదని చెప్పారామె.

'నేను నటించిన మొదటి వాణిజ్య ప్రకటన అమితాబ్ బచ్చన్‌తో.. రెండోది షారుఖ్ ఖాన్‌తో. రెండూ మంచి ఆదరణ పొందిన వాణిజ్య ప్రకటనలు కావడంతో నాకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. మర్డర్ వంటి సినిమాల్లో ప్రధాన పాత్రలలో నటించే అవకాశం దొరికింది' అని చెప్పారామె.

మర్డర్ సినిమా 2004లో విడుదలైంది.. అందులో మల్లికతో పాటు ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రలో నటించారు.

రాజీపడకపోవడం వల్లే...

రాజీపడని తన వ్యక్తిత్వమే తనకు ఎన్నో సినీ అవకాశాలను దూరం చేసిందని మల్లిక అన్నారు.

''నేను చాలా నష్టపోయాను. హీరోలు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌ను సినిమాల్లో పెట్టుకోవాలనుకుంటారు. అలాంటి హీరోలతో రాజీపడకపోవడం వల్ల చాలా పాత్రలు పోగొట్టుకున్నాను'' అన్నారు మల్లిక. తన వద్దకు 65 స్క్రిప్టులు వచ్చినా అందులో ఒక్క పాత్రకూ తనను తీసుకోలేదని, హీరోల కారణంగానే ఇలా జరిగిందని మల్లిక చెప్పుకొచ్చారు.

'గురు' సినిమాలో కథకు బలం చేకూర్చే సహాయక పాత్ర తనదని.. కానీ, చివరికి వచ్చేసరికి ఎడిటింగ్‌లో తన పాత్ర తొలగించి కేవలం ఒక పాట ఉంచారని మల్లిక చెప్పారు.

గురు సినిమా 2007లో విడుదలైంది.. ఇందులో మల్లిక నటించిన 'మయ్యా మయ్యా' అనే పాట బాగా ఆదరణ పొందింది.

మల్లిక శెరావత్

ఏ గాడ్‌ఫాదర్ లేనివారికి బాలీవుడ్ ప్రయాణం అంత సులభం కాదు..

కాగా.. బాలీవుడ్‌లో తన ప్రస్థానంపై సంతృప్తిగానే ఉన్నట్లు మల్లిక చెప్పారు.

పేరున్న కుటుంబాలకు చెందనివారు.. ఏ గాడ్‌ఫాదర్ లేనివారికి బాలీవుడ్ ప్రయాణం అంత సులభం కాదని మల్లిక అన్నారు.

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫాంలు గేమ్ చేంజర్ కానున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా విస్తరించడానికి ముందు, ఓటీటీలు రావడానికి ముందు పేరున్న కుటుంబాలకు చెందని.. సినీ ప్రముఖులు బాయ్‌ఫ్రెండ్‌లుగా లేని, ఏ గాడ్‌ఫాదర్ లేని వారికి చాలా కష్టమయ్యేదని.. కానీ, ఇప్పుడు ఈ వేదికలు అలాంటి వారికి ఉపయోగపడుతున్నాయని చెప్పారు.

హాలీవుడ్‌కి పని కోసం వెళ్లలేదు..

కాగా మల్లిక కొంతకాలం హాలీవుడ్ వైపు వెళ్లారు. దీనిపై మాట్లాడిన ఆమె... అక్కడ పని సంస్కృతి తెలుసుకోవడానికే వెళ్లాను కానీ అక్కడ పని చేయడానికి వెళ్లలేదని చెప్పారు.

'అక్కడివారు నాతో కలిసిపనిచేయాలనుకుంటే మంచిదే. బ్రూనో మార్ష్ తన వీడియోలలో నన్ను నటింపజేశారు. జాకీచాన్‌తోనూ ఒక సినిమా చేశాను. హాలీవుడ్‌లో పనిచేయాలని వెళ్లలేదు.. ఇండియాలో పని వెతుక్కోవాలనీ లేదు. ఏ పనైనా నచ్చితేనే చేస్తాను. లేకపోతే వేరే పని చూసుకుంటాను' అన్నారు మల్లిక.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Mallika Sherawat: 'I lost a lot of opportunities because of not compromising with such heroes'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X