Starlink: స్టార్ లింక్ వాడుతున్న మణిపూర్ రెబెల్స్-ఎలాన్ మస్క్ క్లారిటీ..!
మణిపూర్ లో తెగల మధ్య కొంతకాలంగా సాగుతున్న ఘర్షణలను ఎలా అదుపు చేయాలో తెలియక ప్రభుత్వాలు తలపట్టుకుంటున్నాయి. భారీ ఎత్తున హింస చోటు చేసుకుని జనం చనిపోతున్నా ప్రధాని మోడీ సైతం మణిపూర్ వెళ్లేందుకు ఇప్పటికీ ఇష్టపడటం లేదు. ఇలాంటి పరిస్ధితుల్లో మణిపూర్ లో రెబెల్స్ ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన స్టార్ లింక్ ను సమాచార మార్పిడి కోసం వాడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై స్వయంగా మస్క్ స్పందించారు.
తాజాగా భద్రతా బలగాలు మణిపూర్ లో హింస జరిగిన ప్రాంతంలో స్టార్ లింక్ లోగోతో ఉన్న ఓ డివైజ్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఫొటోలు విడుదల చేసాయి. దీంతో మణిపూర్ రెబెల్స్ స్టార్ లింక్ ను తమ కమ్యూనికేషన్ల కోసం వాడుతున్నారన్న ప్రచారం గుప్పుమంది. హింసను అరికట్టే క్రమంలో భద్రతా బలగాలు ఇక్కడ కమ్యూనికేషన్ల వ్యవస్థలను తరచూ నిలిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరికి అందకుండా స్టార్ లింక్ ను రెబెల్స్ వాడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

ఈ వ్యవహారం కాస్తా ఎలాన్ మస్క్ దృష్టికి వెళ్లింది. దీనిపై ఆయన స్పందించారు. మణిపూర్ హింసలో పాల్గొంటున్న రెబెల్స్ తమ స్టార్ లింక్ ను తమ కమ్యూనికేషన్ కోసం వాడుతున్నారన్న ప్రచారాన్ని ఎలాన్ మస్క్ తోసిపుచ్చారు. వాస్తవానికి భారతదేశంలో స్టార్‌లింక్ సేవలు ఇంకా ప్రారంభం కాలేదు. అటువంటప్పుడు స్పేస్ ఎక్స్ కంపెనీ సైతం తన ప్లాట్‌ఫారమ్ ద్వారా దేశంలో కమ్యూనికేషన్‌లను చట్టబద్ధంగా అనుమతించదు. దీంతో స్పందించిన మస్క్..స్టార్‌లింక్ ఉపగ్రహ కిరణాలు భారతదేశం మీదుగా ఆఫ్ చేయబడ్డాయని ఎక్స్ లో పోస్టు చేశారు.












Click it and Unblock the Notifications