భారత్ లో మార్కొ రూబియో ల్యాండ్- ట్రంప్ రైట్ హ్యాండ్ రాక వెనుక?
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్ లో అడుగు పెట్టారు. ఈ తెల్లవారు జామున కోల్ కత చేరుకున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు ఆయనకు గన స్వాగతం పలికారు. మార్కో రూబియో భారత పర్యటనకు రావడం ఇదే మొదటిసారి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఇక్కడికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
నాలుగు రోజుల పాటు రూబియో భారత్ పర్యటిస్తారు. ఇందులో భాగంగా ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమౌతారు. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, క్వాడ్ సహకారంపై కీలక చర్చలు జరపనున్నారు. కోల్‌కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ నగరాలను సందర్శిస్తారు. ఈ నెల 26న జరిగే కీలక క్వాడ్ సమావేశానికి హాజరవుతారు. దీంతో ఆయన పర్యటన ముగుస్తుంది.

రూబియో కోల్‌కతా సందర్శన దౌత్యపరంగా కీలకం. గత 14 సంవత్సరాలలో.. అంటే 2012లో హిల్లరీ క్లింటన్ సందర్శన తర్వాత, కోల్‌కతాకు వచ్చిన మొదటి అమెరికా విదేశాంగ మంత్రి ఆయనే. భారత్, అమెరికా మధ్య వాణిజ్యం, రక్షణ, ఇంధనం, ఇండో-పసిఫిక్ సహకారంపై పెరుగుతున్న వ్యూహాత్మక సంబంధాలకు ఆయన పర్యటన అద్దం పట్టినట్టయింది.
విదేశాంగ మంత్రిత్వ శాఖ.. రూబియో కోల్‌కతా షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేయనప్పటికీ అమెరికా కాన్సులేట్ వర్గాల సమాచారం ప్రకారం, ఆయన మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ప్రధాన కార్యాలయం మదర్ హౌస్‌ను నేడు సందర్శించే అవకాశం ఉంది. ఢిల్లీతో పాటు ఆగ్రా, జైపూర్ నగరాలకు కూడా వెళ్లనున్నారు మార్కో రూబియో. అక్కడి పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్నారు.
భారత్‌కు బయలుదేరే ముందు మియామిలో విలేకరులతో మాట్లాడారు రూబియో. భారత్‌కు ఇంధన ఎగుమతులు పెంచాలని ఆసక్తిగా ఉన్నామని తెలిపారు. భారత్ ఎంత ఇంధనం కొనుగోలు చేయగలిగితే, అంత ఇంధనాన్ని తాము వారికి విక్రయించాలనుకుంటున్నామని స్పష్టం చేశారు. రికార్డు స్థాయిలో ఉన్న అమెరికా ఇంధన ఉత్పత్తి, ఎగుమతులను ఆయన ప్రస్తావించారు.
పెరుగుతున్న ఇంధన ధరలు, హార్ముజ్ జలసంధి చుట్టూ ఉన్న అంతరాయాలకు సంబంధించిన ఆందోళనలపై బదులిస్తూ.. భారత్‌ను ఓ గొప్ప భాగస్వామిగా అభివర్ణించారు. మే 26న జరగనున్న క్వాడ్ సమావేశంలో రూబియోతో పాటు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తో పాటు ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు పెన్నీ వాంగ్, తోషిమిట్సు మొటెగి పాల్గొనే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications