ఉగ్రవాదుల వేటలో ట్విస్ట్ లు- చిక్కినట్లే చిక్కి నాలుగుసార్లు మిస్సింగ్..?
కశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇందుకు కారకులైన ఉగ్రవాదుల కోసం పారామిలటరీ బలగాలు తీవ్ర గాలింపు చేపట్టాయి. కశ్మీర్లో అడుగడుగూ గాలిస్తున్నాయి. భూమార్గంలో, వైమానిక మార్గంలో, సరస్సుల్లోనూ పడవల్లో గాలింపు చేపట్టాయి. అయితే ఇప్పటివరకూ వారిని పట్టుకోలేదు. కానీ తాజాగా ఈ ఐదు రోజుల్లోనే నాలుగు సార్లు తీవ్రవాదుల జాడల్ని సైన్యం గుర్తించినా పట్టుకునేలోపు పరారైనట్లు తెలుస్తోంది.
దక్షిణ కాశ్మీర్ లో ఉన్న అడవుల్లో తీవ్రవాదుల కోసం సైన్యం తీవ్ర గాలింపు జరుపుతోంది. ఈ గాలింపులో తీవ్రవాదుల జాడల్ని సైన్యం పలుమార్లు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే దగ్గరికి వెళ్లి పట్టుకునే లోపే తీవ్రవాదులు పారిపోతున్నట్లు సమాచారం. ఇలా ఐదు రోజుల్లో నాలుగు సార్లు జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు వెల్లడించాయి. స్థానిక ప్రజలు, నిఘా వర్గాల నుంచి లభించిన సమాచారంతో గాలింపులో ఉన్న సైనికులు వారిని సమీపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇంకా చెప్పాలంటే ఇదో పిల్లీ, ఎలుక ఆటలా మారినట్లు తెలుస్తోంది. తీవ్రవాదుల్ని పట్టుకునేందుకు అన్ని మార్గాల్లో భారీ ఎత్తున బలగాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వారు కూడా అంతే అప్రమత్తంగా అంటూ స్థావరాలు మార్చేస్తున్నట్లు సమాచారం. దీంతో తీవ్రవాదుల జాడ కనిపెట్టడం కష్టసాధ్యంగా మారుతోంది. పహల్గాంలో దాడి తర్వాత భారత్-పాక్ సరిహద్దు అయిన నియంత్రణ రేఖ వద్ద గస్తీ భారీగా పెరగడంతో తీవ్రవాదులు అటువైపు వెళ్లేందుకు సాహసించడం లేదు. దీంతో అడవుల్లోనే తిరుగుతూ భద్రతా బలగాల నుంచి తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications