తమిళనాడుకు షాక్: మేకదాటు డ్యాంకు రూ. 5 వేల కోట్లు !
బెంగళూరు: తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ఇంతకాలం అడ్డం పడుతున్న మేకదాటు (కావేరీ నది) తాగునీటి డ్యాం నిర్మించడానికి కర్ణాటక ప్రభుత్వం సిద్దం అయ్యింది. మేకదాటు (మేకేదాటు) తాగు నీటి డ్యాం నిర్మించడానికి రూ. ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
కర్ణాటక ప్రభుత్వం మేకదాటు తాగు నీటి డ్యాం నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించింది. అందుకు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) సిద్దం చేసింది. త్వరలోనే డీపీఆర్ ను మంత్రి వర్గ సమావేశంలో ప్రవేశపెట్టి అనుమతి తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
బీభత్సంగా వర్షాలు పడిన సందర్బంలో కావేరీ నది నుంచి భారీగా నీరు తమిళనాడుకు వెళ్లిపోతున్నది. మేకదాటు తాగు నీటి డ్యాం నిర్మించి, నీరు నిల్వ చేసి బెంగళూరు, మైసూరు నగరాలకు తాగు నీరు సరఫరా చెయ్యాలని కర్ణాటక ఈ డ్యాం నిర్మించాలని నిర్ణయించింది.
అయితే మేకదాటు తాగు నీటి డ్యాం నిర్మించడానికి తమిళనాడు ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. మేకదాటు డ్యాం నిర్మించకుండా అడ్డుకోవాలని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి జయలలిత లేఖ రాశారు.

అయితే మేకదాటు డ్యాం నిర్మించడం వలన తమిళనాడుకు నీటి కొరత ఉండదని కర్ణాటక ఇప్పటికే స్పష్టం చేసింది. కావేరీ జలాల పంపిణి విషయంలో గొడవలు జరుగుతున్న సందర్బంలోనే మేకదాటు తాగు నీటి డ్యాం నిర్మించడానికి రూ. ఐదు వేల కోట్లు అవుతుందని కర్ణాటక ప్రభుత్వం అంచనా వేసింది.
రూ. ఐదు వేల కోట్లతో మేకదాటు తాగునీటి డ్యాంను రెండు వైపులా సమాంతరంగా నిర్మించనున్నారు. సుమారు 60 టీఎంసీ నీటిని నిల్వ చెయ్యనున్నారు. తాగు నీటి సరఫరా చేయ్యడంతో పాటు ఇక్కడ విద్యుత్ ప్లాంట్ నిర్మించడానికి రూ. ఐదు వేల కోట్లు వ్యయం అవుతుందని కర్ణాటక ప్రభుత్వం అంచనా వేసింది.












Click it and Unblock the Notifications