ములాయంకు అసదుద్దీన్ షాక్: యూపీపై కన్ను, బీజేపీకే లాభం
హైదరాబాద్: మొన్నటి వరకు హైదరాబాదుకే పరిమితమైన మజ్లిస్ పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించేందుకు పావులు కదుపుతోంది. మొన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రెండు స్థానాలు గెలుపొందింది. తమకు పట్టు ఉంటుందని భావిస్తున్న మిగతా రాష్ట్రాల పైన కూడా దృష్టి సారించింది.
ఇందులో భాగంగా మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ఇటీవల మాట్లాడుతూ.. వచ్చే ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని ప్రకటించారు. అయితే, ఈ ప్రకటన అందరికంటే ఎక్కువగా అధికార సమాజ్ వాది పార్టీకి వణుకు పుట్టిస్తోందని అంటున్నారు.

ఉత్తర ప్రదేశ్‌లో ముస్లీం వర్గాల అండ ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాది పార్టీకి మొదటి నుండి ఉంది. ఇటీవల కొంత పట్టు తగ్గినా, ఆ పార్టీకి వారు బలం. అయితే, ఇప్పుడు మజ్లిస్ పార్టీ రాష్ట్రంలోకి వస్తే తమ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంటుందని ఆ పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతోందంటున్నారు.
అదే సమయంలో మజ్లిస్ పార్టీ ఉత్తర ప్రదేశ్‌లో పోటీ చేస్తే అది భారతీయ జనతా పార్టీకి లాభిస్తుందని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మజ్లిస్ పార్టీ రాష్ట్రంలోకి వస్తే అత్యంత ఎక్కువగా దెబ్బతినే పార్టీ సమాజ్ వాది పార్టీయే అంటున్నారు.
సమాచారం మేరకు.. మజ్లిస్ పార్టీ ఇప్పటికే యూపీల తన నెట్ వర్క్‌ను ప్రారంభించింది. వచ్చే శాసన సభ ఎన్నికల నాటికి తమ పార్టీ అభ్యర్థులను గుర్తించే పనిలో పడిందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎఖ్కడ పట్టు ఉంటుందని భావిస్తే అక్కడ పోటీ చేయనున్నారు. తమకు పట్టు ఉందని భావించి, సరైన అభ్యర్థులు దొరికితే నాన్ ముస్లీం అభ్యర్థులను కూడా నిలబెడతారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications