భారీ మైనార్టీ స్కాలర్ షిప్పుల స్కాం-34 రాష్ట్రాల్లో అక్రమాలు-సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశం..
దేశంలోని పలు రాష్ట్రాల్లో మైనార్టీ స్కాలర్ షిప్పుల పేరుతో భారీగా అక్రమాలు జరిగినట్లు కేంద్రం పరిశీలనలో వెల్లడైంది. 34 రాష్ట్రాల్లో కేంద్రం ఇచ్చే మైనార్టీ స్కాలర్ షిప్పుల పేరుతో నకిలీ సంస్ధలు భారీగా నిధులు కాజేసినట్లు ప్రాధమికంగా నిర్ధారణ అయింది. ప్రస్తుతం మైనార్టీ స్కాలర్ షిప్పులు తీసుకుంటున్న సంస్ధల్లో 53 శాతం నకిలీవేనని తేలింది. దీంతో కేంద్ర ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది.
మైనారిటీ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కింద ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్న 53 శాతం సంస్థలు నకిలీగా కేంద్రం తేల్చింది. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన అంతర్గత విచారణలో ఇటువంటి 830 సంస్థలలో లోతుగా పాతుకుపోయిన అవినీతి బయటపడింది. ఇది గత ఐదేళ్లలో రూ.144.83 కోట్ల కుంభకోణానికి దారితీసిందని తేలింది. తదుపరి విచారణ కోసం కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ విషయాన్ని సీబీఐకి అప్పగించారు.

కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జూలై 10న అధికారికంగా దీనిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ దర్యాప్తులో 34 రాష్ట్రాల్లోని 100 జిల్లాల్లో విచారణ జరిగింది. 1572 సంస్థలను పరిశీలించగా, 830 సంస్థలు మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలింది. 34 రాష్ట్రాలలో 21 రాష్ట్రాల నుండి గణాంకాలు వచ్చాయని, మిగిలిన రాష్ట్రాల్లోని సంస్థలపై పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతానికి ఈ 830 సంస్థలకు సంబంధించిన ఖాతాలను స్తంభింపజేయాలని అధికారులు ఆదేశించారు.
మైనార్టీ మంత్రిత్వ శాఖ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ దేశంలో సుమారు 1,80,000 సంస్థలకు విస్తరించింది. 1వ తరగతి నుండి ఉన్నత విద్య వరకు విద్యార్థులను ఇది కవర్ చేస్తుంది. 2007-2008 విద్యా సంవత్సరంలో ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్ కోసం నకిలీ లబ్ధిదారులతో, మైనారిటీ విద్యార్థుల కోసం ఉద్దేశించిన స్కాలర్‌షిప్‌లను ఈ సంస్థలు ప్రతి సంవత్సరం క్లెయిమ్ చేస్తున్నట్లు తేలింది. వీటిపై ఇప్పుడు సీబీఐ దర్యాప్తు జరపబోతోంది.












Click it and Unblock the Notifications