అర్ధరాత్రి భూకంపం.. 30 కిలోమీటర్ల లోతులో కంపించిన నేల!
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ధలై జిల్లా కేంద్రంగా భారీ శబ్దంతో ప్రకంపనలు రావడంతో, నిద్రలో ఉన్న జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 3.8గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సరిగ్గా అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట ప్రాంతంలో ఈ సంఘటన జరగడంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) అందించిన ప్రాథమిక వివరాల ప్రకారం.. ఈ రోజు తెల్లవారుజామున 00:57:38 గంటలకు (IST) భూమి అంతర్భాగంలో ప్రకంపనలు మొదలయ్యాయి. ధలై జిల్లాలోని రేఖాంశం 23.757 ఉత్తరం, అక్షాంశం 91.995 తూర్పు ప్రాంతంలో, భూ ఉపరితలానికి దాదాపు 30 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం నమోదైంది. ఈ మేరకు సీస్మోలజీ విభాగం ఎక్స్ వేదికగా అధికారికంగా సమాచారాన్ని పంచుకుంది.
స్వల్ప తీవ్రతతో వచ్చిన భూకంపం కావడంతో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఆస్తి నష్టం గానీ సంభవించినట్లు నివేదికలు అందలేదని స్థానిక యంత్రాంగం స్పష్టం చేసింది. అయితే అర్ధరాత్రి పూట ఒక్కసారిగా భూమి ఊగడంతో ప్రజలు గంటల తరబడి వీధుల్లోనే గడిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, అత్యవసర సహాయక బృందాలు క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తున్నాయని అధికారులు తెలిపారు.













Click it and Unblock the Notifications
