ఢిల్లీలో 6.0 తీవ్రతతో భూకంపం వస్తే 38 శాతం భవనాలు కుప్పకూలుతాయ్
ఢిల్లీలో సత్య నికేతన్ ప్రాంతంలో అయిదంతస్తుల భవనం అకస్మాత్తుగా కుప్పకూలిన దారుణ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం అక్కడి భవనాల భద్రతా వైఫల్యాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. భవిష్యత్తులో సంభవించబోయే భారీ భూకంపాల ముప్పును ఇది ముందే హెచ్చరించినట్టయింది. ఈ బలహీన నిర్మాణాల మధ్య కోట్లాది మంది ప్రజలు ఎలా ముప్పు అంచున జీవిస్తున్నారనేది ఇప్పుడు అతిపెద్ద ఆందోళనగా మారింది.
సత్య నికేతన్ ప్రాంతంలో 50 ఏళ్ల నాటి భవనం అది. దాన్ని పీజీగా వినియోగిస్తోన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అధికారులు జరిపిన ప్రాథమిక విచారణలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పాత నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేకుండా అదనపు అంతస్తులను నిర్మించినట్లు తేలింది. పాత భవనం కావడం, భద్రతపరంగా ఎటువంటి చర్యలు తీసుకోకుండా అదనపు అంతస్తులను నిర్మించడం వల్ల అది కుప్పకూలింది.

రద్దీగా ఉండే ఇరుకైన వీధుల్లో ఉన్న ఇటువంటి బలహీన నిర్మాణాలు ప్రమాదాల బారిన పడినప్పుడు సహాయక చర్యలకు కూడా పెద్ద అడ్డంకిగా మారుతుందనే విషయాన్ని ఈ ఘటన ఎత్తిచూపింది. ఈ ఘటన తర్వాత నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ శాస్త్రవేత్తలు రజత్ పస్రిచా, కపిల్ మోహన్, ఓపీ మిశ్రా.. ఈ అధ్యయానాన్ని నిర్వహించారు. ఎన్విరాన్‌మెంటల్ ఎర్త్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురితం అయ్యాయి. దీని వివరాలను ఇండియా టుడే ఎక్స్ క్లూజివ్ గా ప్రచురించింది.
దీని ప్రకారం.. ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలోని సుమారు 89 లక్షల భవనాలలో 38 శాతం ఫాల్ట్ లైన్ జోన్ పరిధిలో ఉన్నాయి. ఓ మోస్తరు భూకంపాలను కూడా అవి తట్టుకోలేవు. అంటే.. దాదాపు 33 లక్షలకు పైగా నిర్మాణాలు ప్రమాదంలో ఉన్నట్టే. రిక్టర్ స్కేల్ పై 6.0, లేదా అంత కంటే తీవ్రతతో భూకంపం అంటూ సంభవించడం జరిగితే గనక ఇన్ని లక్షల ఇళ్లు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని ఈ అధ్యయనం అంచనా వేసింది.
భౌగోళిక ప్రాముఖ్యత పరంగా ఢిల్లీ నగరం అత్యంత ప్రమాదకరమైన సీస్మిక్ జోన్ 4 పరిధిలో విస్తరించి ఉంది. స్థానిక భూగర్భ లోపాల వల్ల మాత్రమే కాకుండా, సున్నితమైన హిమాలయ ప్రాంతంలో సంభవించే తీవ్రమైన భూకంపాల ప్రభావం కూడా నేరుగా ముడిపడి ఉంటుంది. నగరంలో విపరీతంగా పెరుగుతున్న జన సాంద్రత, దశాబ్దాల నాటి పాత కట్టడాలు, శాస్త్రీయ నిబంధనలు పాటించకుండా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు.. ఇక్కడి ముప్పును మరింత రెట్టింపు చేస్తోన్నాయి.
ఢిల్లీలోని అనేక మధ్యతరగతి కాలనీలలోని ఇరుకైన రోడ్లు భూకంప సమయాల్లో అగ్నిమాపక దళాలు, ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలకు తీవ్ర అవరోధంగా మారినట్లు నిపుణులు హెచ్చరిస్తోన్నారు. ఇక్కడి నేల స్వభావం కూడా భూప్రకంపనల తీవ్రతను పెంచేలా ఉందని చెబుతున్నారు. విద్యార్థులు నివసించే పీజీలపై కఠిన నిబంధనలు అమలు చేయాలని ఢిల్లీ అధికారులు యోచిస్తోన్నారు. భవన నిర్మాణాల పటిష్టతపై తక్షణమే సేఫ్టీ ఆడిట్ చేపట్టాలని నిర్ణయించారు.













Click it and Unblock the Notifications
