అసభ్యంగా కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఢిల్లీ శానససభ ఎన్నికల ప్రచారంలో కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అమర్యాకరమైన వ్యాఖ్యలు చేశారు. పైగా తన వ్యాఖ్యలను ఆమె సమర్థించుకున్నారు. ఆమె వ్యాఖ్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాంగ్రెసు పార్టీ డిమాండ్ చేసింది. అయితే, తాను తప్పేమీ మాట్లాడలేదని కేంద్ర మంత్రి అన్నారు. రాముడి సంతానం పాలన కావాలో, అక్రమ సంతానం పాలన కావాలో ఢిల్లీ ప్రజలు తేల్చుకోవాలని ఆమె అన్నారు.
తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని ఆమె మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాముడి విశ్వసించనివాళ్లపై, దేశ సమైక్యత విశ్వాసం లేనివారిపై మాత్రమే తాను వ్యాఖ్యలు చేశానని, దానికి మతపరమైన రంగు పులమాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. తాను వ్యక్తిని గానీ, కమ్యూనిటీని గానీ, పార్టీని గానీ ప్రస్తావించలేదని చెప్పారు.

రాముడి గురించి మాట్లాడడం తప్పా, రాముడి గురించి మాట్లాడితే మతవిషయం అవుతుందా అని ఆమె అడిగారు. సాధ్వీ నిరంజన్ జ్యోతి దూషణలకు సమాధానం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెసు నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అవినీతిని ప్రోత్సహిస్తున్నారని మంత్రి విమర్శించారు. సోనియా గాంధీ అల్లుడు అంత ధనవంతుడు ఎలా అయ్యారని ఆమె సోనియా రాబర్ట్ వాద్రా విషయంపై ప్రశ్నించారు. దేశంలోని పేదలను వాద్రా దోచుకున్నాడని ఆరోపించారు.
పశ్చిమ ఢిల్లీలోని శ్యాంనగర్‌లో ఓటర్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ నిరంజన్ జ్యోతి దూషణలకు దిగారు. తాము అవినీతికి పాల్పడబోమని, అవినీతిని సహించబోమని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతున్నారని ఆమె అన్నారు. ఈ దేశాన్ని, ప్రజలను దోచుకుంటున్నవారిని ఏమని పిలువాలని ఆమె అడిగారు.












Click it and Unblock the Notifications