ప్రధాని మోదీ భవితవ్యంపై చర్చ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అధినేత మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. చర్చనీయాంశం అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద డిబేటే నడుస్తోంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సీనియర్ నాయకులు సైతం తమ అభిప్రాయాలను వెల్లడిస్తోన్నారు.
75 సంవత్సరాలు వచ్చిన తరువాత రాజకీయాల నుంచి పదవీ విరమణ చేయాల్సిన అవసరం ఉందని మోహన్ భగవత్ తేల్చి చెప్పారు. భారతీయ జనతా పార్టీ విధానం కూడా ఇదేనని వ్యాఖ్యానించారు. 2014లో బీజేపీ వ్యవస్థాగతంగా ఈ నిబంధనను పకడ్బందీగా అమలు చేసిన విషయాన్నీ ఆయన గుర్తు చేశారు.

ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నాగ్ పూర్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజకీయ నాయకులు 75 ఏళ్ల వయసు వచ్చాక, హుందాగా తప్పుకోవాలని, ఇతరులకు అవకాశం ఇవ్వాలని స్పష్టం చేశారు. రాజకీయాల వైపు యువతను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, సీనియర్లు వారికి చుక్కానిలా వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు.
75 సంవత్సరాలు నిండిన తరువాత రాజకీయాల నుంచి వైదొలగాలనే నిర్ణయం.. అప్పట్లో ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, వంటి పలువురు సీనియర్ నాయకుల పదవీకాలాన్ని ప్రభావితం చేసింది. వారందరూ తెరమరుగు అయ్యారు. క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకొన్నారు.
ఇప్పుడు 75 సంవత్సరాలకు చేరువ అవుతోన్న నాయకులు బీజేపీలో చాలామందే ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్.. వంటి సీనియర్ల వయస్సు 74కు పైమాటే. ఈ ఏడాది సెప్టెంబర్ 17వ తేదీన 75వ పుట్టినరోజును జరుపుకోనున్నారు ప్రధాని మోదీ.
ఈ పరిస్థితుల మధ్య ఇప్పుడు తాజాగా ఆర్ఎస్ఎస్ అధినేత.. ఈ 75 సంవత్సరాల నిబంధనను తెర మీదికి తీసుకుని రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నిబంధన ప్రధాని మోదీకి వర్తిస్తుందా? లేదా అనేది చర్చనీయాంశమైంది. మోహన్ భగవత్ వ్యాఖ్యలను ఆధారంగా కాంగ్రెస్ నాయకులు ఘాటు విమర్శలకు దిగుతున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైరామ్ రమేష్, పవన్ ఖేరా, శివసేన (ఉద్ధవ్ థాకరే) నాయకుడు సంజయ్ రౌత్ తో పాటు, బీజేపీకే చెందిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వంటి వారి భిన్నాభిప్రాయాలు ఈ చర్చను మరింత తీవ్రతరం చేశాయి. భగవత్ వ్యాఖ్యలు మోదీ రాజకీయ భవిష్యత్తుపై కొత్త సందేహాలను లేవనెత్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
యూత్ ఇన్ పాలిటిక్స్ అధ్యయనం ప్రకారం- లోక్‌సభ సభ్యుల సగటు వయసు 63 సంవత్సరాలు. 35 ఏళ్లలోపు నాయకులు ఆరు శాతం మాత్రమే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, యువ నాయకత్వానికి అవకాశం కల్పించాలనే భగవత్ సూచించారు. రాజకీయాల వైపు యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు.












Click it and Unblock the Notifications