భారతదేశంలో ఇప్పటికే కొడుకే పుట్టాలని కోరుకునే వారే ఎక్కువ.... జాతీయ సర్వేలో మనసు విప్పిన జంటలు

దేశంలో లింగ నిష్పత్తిలో మెరుగుదల ఉన్నట్లు ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో తేలింది. అయితే, ఇప్పటికీ అత్యధిక సంఖ్యలో దంపతులు ఇంట్లో ఒక్క మగ పిల్లాడైనా ఉండాలని కోరుకుంటున్నారని కూడా ఈ సర్వేలో బైటపడింది.
ప్రభుత్వం నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్‌హెచ్ఎస్-5)లో పాల్గొన్న వారిలో కనీసం 80శాతం మంది తమకు కనీసం ఒక్క మగ పిల్లవాడైనా కావాలని చెప్పారు. ఈ సర్వేను భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న అత్యంత సమగ్రమైన సర్వేగా చెబుతారు.
భారతీయ సమాజంలో ఇంట్లో కనీసం ఒక మగ పిల్లవాడైనా ఉండాలని కోరుకునే సెంటిమెంట్ శతాబ్దాల తరబడి ఉంది. అబ్బాయి కావాలా, అమ్మాయి కావాలా అని అడిగితే, అబ్బాయి కావాలని టక్కున చెప్పేస్తారు. అమ్మాయి కావాలని ఉన్నా, అబ్బాయి తర్వాతే అమ్మాయి గురించి మాట్లాడతారు.
మగ పిల్లలు వృద్ధాప్యంలో తమ బాగోగులు చూసుకుంటారని తల్లిదండ్రులు నమ్ముతారు. ఆడపిల్లలు పెళ్లయ్యాక అత్తమామల దగ్గరికి వెళ్లిపోతారు కాబట్టి మగ పిల్లవాడే తమకు ఆదరువు అని తల్లిదండ్రులు భావిస్తుంటారు.
- భారత్‌లో గత 70 ఏళ్లలో ఏ మతస్థుల జనాభా ఎంత పెరిగింది?
- భారత జనాభా ఈ శతాబ్దం చివరికి ఎందుకు తగ్గుతుంది... తగ్గితే ఏమవుతుంది?

ఇదే దేశంలో ఆడ, మగ పిల్లల నిష్పత్తిలో అంతరానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
గత వందేళ్లుగా నిర్వహించిన జనాభా లెక్కల్లో స్త్రీలకన్నా పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంటూ వస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, ప్రతి 1000 మంది పురుషులకు 940మంది మహిళలు మాత్రమే ఉన్నారు.
ఇక చిన్నారులలో లింగ నిష్పత్తి (ఆరేళ్లలోపు పిల్లలను ఇందులో పరిగణనలోకి తీసుకుంటారు)ని గమనిస్తే ప్రతి 1000 మంది అబ్బాయిలకు 918 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. దీనిపై మీడియాలో విస్తృతమైన కథనాలు వెలువడ్డాయి. దేశంలో మహిళలు అంతరించిపోతున్నారంటూ ఈ కథనాలలో ఆందోళన వ్యక్తమైంది.
అయితే, 2019-21 మధ్య జరిగిన ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5 సర్వేలో తేలిన అంశాలు కాస్త ఊరట కలిగించాయి. గత కొన్నేళ్లుగా లింగ నిష్పత్తిలో మెరుగుదల ఉందని తేలింది. మొదటిసారి పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువ ఉన్నట్లు ఈ సర్వే వెల్లడించింది.
అయితే, అబ్బాయిలు కావాలన్న కోరిక మాత్రం ఏమాత్రం తగ్గలేదని కూడా ఈ నివేదిక పేర్కొంది. సర్వే జరిపిన వారిలో 15శాతం మందిలో 16శాతం మంది పురుషులు, 14 శాతం మంది స్త్రీలు తమకు కొడుకు కావాలని కోరుకున్నారు. మగపిల్లవాడి కోసం ఎదురు చూస్తూ ఆడ పిల్లలను కంటున్నవారు కూడా అనేకమంది ఉన్నారు.
- దేశంలో కండోమ్‌ల వాడకం ఎందుకు పెరిగింది? - జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5
- జనాభాను నియంత్రించిన రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లు తగ్గిస్తారా? - కేంద్రానికి మద్రాస్ హైకోర్టు ప్రశ్న
32 సంవత్సరాల ఇంద్రాణి దేవికి ముగ్గురు అమ్మాయిలు. ఆమె దిల్లీలో ఓ ఇంట్లో పని మనిషిగా ఉన్నారు. ఆమె దృష్టిలో సంపూర్ణ కుటుంబం అంటే ఇద్దరు అబ్బాయిలు, ఒకమ్మాయి.
''కానీ, దేవుడు మా విషయంలో వేరుగా ఆలోచించినట్లున్నాడు. మాకు ముగ్గురూ అమ్మాయిలే’’ అన్నారు ఇంద్రాణీ దేవి.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకోవడం లేదు. ''మా ఆయన బస్ డ్రైవర్ గా పని చేస్తారు. ఇంతకన్నా ఎక్కువమంది పిల్లలను కని వారిని పోషించే స్థితిలో లేము’’ అన్నారామె.
15 నుంచి 19 సంవత్సరాల వయసున్న మహిళలపై జరిగిన సర్వేలో 65శాతం మంది మహిళలు కనీసం ఇద్దరు అమ్మాయిలనుకన్నారు. వారికి అబ్బాయిలు లేరు. వీరంతా తమకు ఇక పిల్లలు వద్దని చెప్పారు. గత సర్వేతో పోల్చినప్పుడు(63శాతం) ఈ సర్వేలో ఇలాంటి వారి సంఖ్య 2 శాతం పెరిగింది.
ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే, అబ్బాయిలకన్నా అమ్మాయిలు కావాలని కోరుకునే వారిశాతం 2015-16 నాటి సర్వేతో పోలిస్తే పెరిగింది. గతంలో ఇది 4.9శాతం ఉండగా, ఈసారి 5.17 శాతానికి పెరిగింది.
- పడిపోతున్న జననాల రేట్లు... ఈ శతాబ్దం చివరికి ప్రపంచం ఎలా ఉండబోతుంది?
- వయసు 100.. సంతానం 1600కిపైగా.. 50 ఏళ్లుగా సంతానోత్పత్తిలోనే.. ఇప్పుడు విశ్రాంతి
అయితే, దీనికి మహిళల సంతానోత్పత్తి తగ్గుదలతో సంబంధం ఉందని, ఒక మహిళ కనే పిల్లల సరాసరి సంఖ్య తగ్గిందని నిపుణులు చెబుతున్నారు.
పట్టణీకరణ, మహిళల్లో అక్షరాస్యత పెరగడం, సంతాన నిరోధక సాధనాలు అందబాటులో ఉండటంతో, సరాసరి సంతానోత్పత్తి సంఖ్య 2 కు పడిపోయింది. ఈ సంఖ్య సుమారు 2.1శాతం ఉన్నప్పుడు జనాభాలో తగ్గుదల మొదలవుతుందని నిపుణులు చెబుతారు.
130 కోట్లమందికి పైగా జనాభా ఉన్న దేశంలో ఇది పెద్ద సమస్య కాదు. కానీ, జనాభాలో ఆరోగ్యవంతమైన పెరుగుదల ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే లింగనిష్పత్తిలో తేడాలను సరి చేయడానికి ప్రభుత్వం కృషి చేయాల్సి ఉందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఫిన్లాండ్: పుతిన్ హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా ఈ దేశం ఎందుకు నాటోలో చేరుతోంది?
- మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని ఔరంగాబాద్‌లో ఎందుకు నిర్మించారు?
- నరేంద్ర మోదీ 75 ఏళ్లకు రిటైర్ అవ్వరా? మూడోసారి కూడా ప్రధాని కావాలనుకుంటున్నారా?
- ఇల్లు కొనడం మంచిదా లేక అద్దెకు ఉండటం మంచిదా.. సొంతిల్లు కొనే ముందు ఇవి తెలుసుకోండి
- సంపూర్ణ చంద్రగ్రహణం: ఎందుకు, ఎలా ఏర్పడుతుంది.. ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)