అత్యంత దారుణంగా.. : ఢిల్లీలో తల్లీ కూతుళ్ల హత్య
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఓ తల్లి కూతుళ్ల దారుణ హత్య కలకలం రేపుతోంది. తల్లితో పాటు ఆమె ఇద్దరు కూతుళ్లను అత్యంత దారుణంగా దుండగులు హత్య చేశారు. ఘటన జరిగిన తీరును బట్టి పదునైన ఆయుధాలతో వాళ్లపై దుండగులు దాడికి తెగబడ్డట్టుగా తెలుస్తోంది. అయితే, హత్యలు జరిగిన మూడు రోజుల తర్వాత ఘటన వెలుగులోకి రావడం గమనార్హం.
మృతుల ఇంటినుంచి దర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో హత్యల ఉదంతం బయటపడింది. ఉత్తర ఢిల్లీలోని బ్రహ్మపుర ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కాగా, మృతుల శరీరాలపై బలమైన కత్తి గాట్లు, ఇళ్లంతా రక్తం మరకలు ఉన్నాయి. మృతులను తల్లి సైరా (50), కూతుళ్లు మెహరున్నీసా (19), షబ్నం (9) గా గుర్తించారు.
పదుననైన ఆయుధంతో దుండగులు సైరా గొంతును కోసినట్టుగా నిర్దారించారు. ఆమె శరీరంపై కత్తిపోట్లను కూడా గుర్తించారు పోలీసులు. ఇక కూతురు మెహరున్నీసా మృతదేహాన్ని బెడ్ రూమ్ లో గుర్తించిన పోలీసులు, బాత్ రూమ్ లో చిన్న కూతురు షబ్నం మృతదేహాన్ని గుర్తించారు.

అనుమానస్పదంగా మారిన ఈ హత్యలను ఎవరైనా దోపిడి దొంగలు చేసుంటారా..! అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించగా, పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.
అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో భాగంగా తెలిసిన వివరాలను గమనిస్తే.. సైరా భర్త రెండేళ్ల క్రితమే మృతి చెందాడు. అంతకుముందు 2011లో ఆయన మరో వివాహం కూడా చేసుకున్నాడు. కాగా, ఆయన వివాహం చేసుకున్న స్త్రీకి అంతకుముందే వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే సైరా కుటుంబానికి, ఆమె భర్త రెండో భార్య కుటుంబానికి మధ్య ఆస్తుల వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే హత్యలు జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక ఇదిలా ఉంటే, సైరా కుటుంబం నివాసముంటున్న అపార్ట్ మెంట్ లోనే గ్రౌండ్ ఫ్లోర్ లో ఓ వ్యక్తి అద్దెకు ఉంటున్నాడు. సైరా కూతురు మెహరున్నీసాతో అతను వన్ సైడ్ లవ్ లో ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు.
హత్యలు జరిగిన నాటి నుంచి సదరు వ్యక్తి ఆచూకీ లేకుండా పోవడం కూడా హత్యోదంతంలో అతని ప్రమేయమేమైనా ఉందా అనుమానాలను రేకెత్తిస్తోంది.












Click it and Unblock the Notifications