రేపే నిమిష ప్రియకు ఉరి..! రంగంలోకి ముస్లిం నేత, కేఏ పాల్..! చివరి ప్రయత్నాలు..!
భారత్ లోని కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు హత్య కేసులో రేపు ఉరిశిక్ష విధించేందుకు యెమెన్ సిద్దమవుతోంది. తనను బంధించి వేధిస్తున్న వ్యాపార భాగస్వామి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అతనికి మత్తుమందు ఇచ్చి చావుకు కారణమైన కేసులో నిమిష ప్రియకు ఉరిశిక్ష పడింది. ఈ శిక్ష నుంచి భారత ప్రభుత్వం అధికారికంగా తప్పించే పరిస్ధితి లేదు. యెమెన్ తో భారత్ కు దౌత్య సంబంధాలు లేకపోవడమే కారణం. ఈ నేపథ్యంలో ఆమెను రేపటి ఉరిశిక్ష నుంచి తప్పించేందుకు ఓ భారతీయ ముస్లిం నాయకుడు రంగంలోకి దిగారు.
రేపు యెమెన్ లో నిమిష ప్రియకు ఉరిశిక్ష విధించడం ఖాయమైన నేపథ్యంలో మృతుడి కుటుంబానికి బ్లడ్ మనీ (క్షమాభిక్ష కోసం హత్యకు పరిహారంగా ఇచ్చే మొత్తం ) 8.6 కోట్లు ఇచ్చేందుకు ఆమె కుటుంబం సిద్దమైంది. అయితే మృతుడి మెహదీ కుటుంబం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అధికారులు కూడా ఉరిశిక్ష విధించేందుకు సిద్ధమయ్యారు. అయితే చివరి నిమిషంలో కేరళకే చెందిన గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియాగా పేరున్న కేరళ ముస్లిం నేత అబూబకర్ ముస్లియార్ రంగంలోకి దిగారు.

యెమెన్ లోని సూఫీ ముస్లిం గురువుల మధ్యవర్తిత్వంతో మృతుడు మెహదీ కుటుంబాన్ని సంప్రదించి నిమిషప్రియకు క్షమాభిక్ష ప్రసాదించాలని అబూబకర్ కోరుతున్నారు. ఈ సంప్రదింపులు ఫలిస్తే రేపు నిమిష ప్రియకు చివరి నిమిషంలో అయినా ఉరిశిక్ష ఆగుతుందని భావిస్తున్నారు. సూఫీ నాయకుడు షేక్ హబీబ్ ఉమర్ బిన్ హఫీజ్ సాయంతో ఇవాళ ఉదయం 10 గంటలకు ధమర్‌లో మహదీ కుటుంబంతో ఆయన సమావేశమయ్యారు.
బాధితుడి దగ్గరి బంధువు, హొదేయిదా యెమెన్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి, యెమెన్ షురా కౌన్సిల్ సభ్యుడు కూడా. దీంతో ఇవాళ ఆయన సమక్షంలో ఈ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వీరి చర్చల తర్వాత యెమెన్ అటార్నీ జనరల్ ను కలిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతానికి నిమిష ప్రియ ఉరిశిక్ష నిలిపివేత లేదా వాయిదా వేయాలని వీరు కోరబోతున్నారు. అయితే దీనిపై అక్కడి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది.

మరోవైపు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా నిమిష ప్రియ కోసం రంగంలోకి దిగారు. యెమెన్ లో ఉన్న మతపరమైన నాయకులతో ఆయన కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. హౌతీ నాయకులు, ప్రభుత్వ నాయకులు కూడా ఈ విషయంలో ప్రయత్నాలు చేస్తున్నట్లు కేఏ పాల్ తెలిపారు. మృతుడి కుటుంబం కోసం పరిహారం తీసుకుని నిమిష ప్రియను క్షమాభిక్ష పెట్టే అవకాశం ఉందని కేఏ పాల్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications