Rahul Gandhi: నేనేమీ సావర్కర్‌ను కాను- నా పేరేంటో తెలుసుగా
న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై అనర్హత వేటు పడింది. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ కార్యాలయం కొద్దిసేపటి కిందటే నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటిపేరు (Modi Surname) వ్యవహారంలో ఆయనను సూరత్ న్యాయస్థానం దోషిగా తేల్చిన నేపథ్యంలో లోక్ సభ సెక్రెటేరియట్ ఈ నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 (1) (ఈ), ప్రజా ప్రతినిధుల చట్టం 1951లోని సెక్షన్ 8 ఆధారంగా ఆయనపై అనర్హత వేటు వేసినట్లు వివరించింది.
అనర్హత వేటు పడిన తరువాత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తొలిసారిగా మీడియా ముందుకొచ్చారు. దేశ రాజధానిలోని ఏఐసీసీ (AICC) ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పై మరోసారి ఆయన విరుచుకుపడ్డారు. మోదీపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలంటూ భారతీయ జనతా పార్టీ (BJP) నాయకులు చేసిన డిమాండ్ ను తోసిపుచ్చారు. తనకు ఆ అవసరం లేదని స్పష్టం చేశారు. లోక్ సభ (Lok Sabha)లో ఉన్నా, లేకున్నా తాను జనంతోనే ఉంటానని, దీన్ని బీజేపీ (BJP) ఎప్పటికీ అడ్డుకోలేదని అన్నారు.

క్షమాపణలు చెప్పడానికి తన పేరేమీ సావర్కర్ (Savarkar) కాదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తన పేరేంటో తెలుసు కదా? అంటూ ఎదురు ప్రశ్న వేశారు. తన పేరు గాంధీ (Gandhi) అని గుర్తు చేశారు. అదాని (Adani) అంశంపై లోక్ సభలో తాను చేసిన ప్రసంగాన్ని తొలగించారని, ఈ విషయాన్ని తాను లోక్ సభ స్పీకర్ (Speeker) దృష్టికి తీసుకెళ్లానని వివరించారు.
తాను విదేశీ శక్తుల సహాయం కోరానంటూ కొంతమంది కేంద్ర మంత్రులు అబద్ధాలు చెప్పారని ధ్వజమెత్తారు. తనపై వేటు వేసినా ప్రశ్నించడాన్ని మాత్రం మానుకోనని, తేల్చి చెప్పారు. ప్రధాని మోదీ- గౌతమ్ అదానీకి మధ్య ఉన్న సంబంధాలను ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారాయన.
అదానితో ప్రధాని మోదీకి గల సంబంధం ఏమిటి అంటూ తాను వేసిన ఒకే ఒక సాధారణ ప్రశ్నకు సమాధానాన్ని ఇవ్వలేని ప్రభుత్వం ఇంత డ్రామా చేస్తోందంటూ రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రధానిని రక్షించడానికి ఈ ఆర్కెస్ట్రా సాగిస్తోందంటూ ఆయన ఎద్దేవా చేశారు.
అదానీ షెల్ కంపెనీలకు 20,000 కోట్ల రూపాయలను ఎవరు మళ్లించారనేది తెలుసుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజల మీద ఉందా? లేదా? అంటూ రాహుల్ గాంధీ సూటిగా ప్రశ్నించారు. నిజాన్ని మాట్లాడటం, అబద్ధాన్ని ప్రశ్నించడం తప్ప తనకు మరే విషయం మీద పెద్దగా తాను దృష్టించట్లేదని అన్నారు.












Click it and Unblock the Notifications