వ్యాపం స్కాం: ఎంబీబీఎస్ విద్యార్థిని నమ్రతది హత్య
భోపాల్: వ్యాపం స్కాం కేసులో అనుమానాస్పద స్థితిలో మరణించిన నమ్రత దామర్ (19)ది హత్య అని ఆమెకు పోస్టుమార్టం చేసిన వైద్యుల బృందంలోని డాక్టర్ బీబీ పురోహిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఆ కేసు మూసివేసి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
25 ఏళ్ల అనుభవం ఉన్న ముగ్గురు వైద్యుల బృందం నమ్రతకు పోస్టుమార్టం చేసిందని, తాము ఎక్కడా నమ్రత ఆత్మహత్య చేసుకుందని నివేదిక ఇవ్వలేదని గుర్తు చేశారు. అయితే పోలీసులు మాత్రం నమ్రతది ఆత్మహత్య అని కేసు మూసివేశారని ఆరోపించారు.
వ్యాపం స్కాంలో ఎంబీబీఎస్ సీటు సంపాదించిందని ఆరోపణలు ఎదుర్కున్న నమ్రత ఇండోర్ మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ విద్యాభ్యాసం చేసేది. 2012 జనవరి నెలలో ఉజ్జయిన్ లోని రైల్వే ట్రాక్ మీద నమ్రత శవమై కనిపించింది. పోలీసులు ఆత్మహత్య చేసుకుందని కేసు నమోదు చేశారు.

2012 జనవరి 9వ తేదీన వైద్యులు పోస్టుమార్టం నివేదిక ఇచ్చారు. అందులో నమ్రతను బలంగా గొంతు నులమడం వల్ల మరణించిందని, ఆమె శరీరంలోని అనేక చోట్ల గోర్లతో దాడి చేసిన గుర్తులు ఉన్నాయని, అంతే కాకుండా రైల్వే ట్రాక్ మీద శవాన్ని లాక్కుని వెళ్లిన సమయంలో గాయాలైనాయని నివేదిక ఇచ్చారు.
అయితే పోలీసులు 2014లో నమ్రత ఆత్మహత్య చేసుకునిందని కేసు మూసివేశారు. ఇటివల నమ్రత తండ్రిని ఇంటర్వూ చెయ్యడానికి వెళ్లిన విలేకరి అక్షయ్ సింగ్ నమ్రత ఇంటి సమీపంలోనే అనుమానాస్పద స్థితిలో మరణించడంతో నమ్రత కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది. పోలీసులు మళ్లీ కేసు దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications