తమిళనాడు ఎస్ఐఆర్ బిగ్ షాక్- కోటి ఓట్ల అవుట్-చెన్నైలోనే 14.25 లక్షలు..!
తమిళనాడులో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ రాజకీయ పార్టీలకు భారీ షాకిచ్చింది. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్) తర్వాత ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో దాదాపు కోటి మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇందులో ఒక్క చెన్నై మహానగరంలోనే 14.25 లక్షల ఓట్లు ఉన్నాయి. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తమిళనాడులో ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ తర్వాత ఇవాళ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అర్చన పట్నాయక్ ఇవాళ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ చేపట్టిన ఈ ఓటర్ల జాబితాల సవరణ వివరాలను ఎస్ఐసీ ప్రకటించారు. ఇందులో మొత్తం 97 లక్షల మంది ఓటర్లను ముసాయిదా ఓటర్ల జాబితా నుండి తొలగించారు. తొలగింపులలో 26 లక్షల 94 వేల 672 మంది మరణించిన ఓటర్లుగా తేల్చారు. అలాగే 66,44,881 మంది ఓటర్లు బదిలీ అయినట్లు నిర్ధారించారు. మరో 3,39,278 మంది వేర్వేరు ప్రాంతాల్లో ఓటర్లుగా ఉన్నట్లు తేల్చారు.

తాజా ఓటర్ల జాబితాల సవరణ తర్వాత తమిళనాడులో మొత్తం ఓటర్ల సంఖ్య 5.43 కోట్లుగా తేలింది. వీరిలో వీరిలో 2.66 కోట్ల మంది పురుషులు, 2.77 కోట్ల మంది మహిళలు, 7,191 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. గతంలో ఇది 6.41 కోట్ల మందిగా ఉంది. ఈ సవరణలో ప్రధాన నగరాలవారీగా చూస్తే చెన్నైలో 14.25 లక్షల ఓట్లు, కోయంబత్తూరులో 6.50 లక్షల మంది ఓట్లు తొలగించారు. దిండిగల్ జిల్లాలో 2.34 లక్షల ఓట్లు తీసేశారు. అలాగే కరూర్‌లో 79,690 మంది ఓటర్లను తొలగించారు. కాంచీపురం జిల్లాలో 2.74 లక్షల మంది ఓటర్లను తీసేశారు.

రాష్ట్రంలోని షోలింగనల్లూర్, పల్లవరం నియోజకవర్గాల్లో ఎక్కువగా ఓట్లను తొలగించినట్లు తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారి అర్చన పట్నాయక్ తెలిపారు. కొన్ని వర్గాల పేర్లను ఎంపిక చేసి తొలగిస్తున్నారనే ఆరోపణలకు స్పందిస్తూ.. తగిన విధానాన్ని పాటించకుండా ఏ పేరును ఏకపక్షంగా తొలగించలేమన్నారు.












Click it and Unblock the Notifications