నీట్ వివాదంపై పార్లమెంట్ లో నిరసనలు-చర్చకు సిద్దమేనన్న కేంద్రం..!
పార్లమెంట్ తొలి సమావేశాల్లోనూ విపక్షాల నిరసనల పర్వం కొనసాగుతోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్ధుల జీవితాలతో ముడిపడిన నీట్ పరీక్ష పేపర్ లీక్, ఇతర వివాదాలపై చర్చ కోరుతూ విపక్షాలు ఇవాళ పార్లమెంట్ ఉభయసభల్ని అడ్డుకున్నాయి. దీంతో సభా కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ క్రమంలో నీట్ పై చర్చకు తాము సిద్ధమని కేంద్రం ప్రకటించింది.
నీట్ తో పాటు ఇతర పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలపై చర్చ కోరుతూ ఇవాళ ఉదయం విపక్షాలు ఉభయసభల్లో వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. వీటిని కేంద్రం తిరస్కరించడంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి. నీట్ సహా డజనుకు పైగా పోటీ పరీక్షల నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వైఫల్యాన్ని విపక్షాలు ప్రస్తావించాయి. విపక్షాల ఆందోళనలపై స్పందించిన కేంద్రం.. పరీక్షల వివాదాలపై ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది.

నీట్ పేపర్ లీక్ కేసుపై తనకు 22 నోటీసులు అందాయని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. నీట్‌లో జరిగిన అవకతవకలపై న్యాయమైన విచారణ జరుగుతుందని రాష్ట్రపతి తన ప్రసంగంలో 20వ పేరాలో ఇప్పటికే చెప్పారని స్పీకర్ ఓం బిర్లా గుర్తుచేశారు. అనంతరం సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. మరోవైపు దేశంలో విద్యార్ధుల భవిష్యత్తుపై అన్ని పార్టీలు ఆందోళన చెందుతున్నాయన్న సందేశాన్ని పార్లమెంట్ ప్రజలకు పంపాల్సిన అవసరం ఉందని విపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. రాజ్యసభలోనూ అన్ని కార్యకలాపాలను సస్పెండ్ చేసి నీట్ పై చర్చించాలని ఎంపీలు నోటీసులిచ్చారు.












Click it and Unblock the Notifications