మోడీ మాటపై శ్రీలంక వదిలేసింది!: వెంకయ్య, ఏపీ రాజధానిపై...
హైదరాబాద్: భారత జాలర్లను ప్రధాని నరేంద్ర మోడీ మాట మేరకు శ్రీలంక కేసులు సైతం లేకుండా విడుదల చేసిందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం అన్నారు. శ్రీలంక ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైందన్నారు. త్వరలో తమిళ జాలర్ల సమస్యసు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో భారతీయ జనతా పార్టీ అతి పెద్ద పార్టీ అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడారు. ఎన్డీయే ప్రభుత్వం అజెండా అభివృద్ధి మాత్రమేనన్నారు. ఆరెస్సెస్ పైన అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆరెస్సెస్ రాజకీయాల్లో జోక్యం చేసుకోదని చెప్పారు. తాను కబడ్డీ ఆడేందుకు వెళ్లి ఆరెస్సెస్ సభ్యుడిని అయ్యానని తెలిపారు.
శ్రీరాముడు ఆదర్శవంత పాలకుడు అన్నారు. ఆయనను కూడా రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు. తాను సింగపూర్‌లో తాను మూడు గంటల పాటు విద్యార్థిగా స్వచ్ఛత గురించి నేర్చుకున్నానని తెలిపారు. రాజకీయ నాయకులు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అంతేకానీ, దోచుకోకూడదన్నారు. ఎన్నో ఎళ్లుగా పార్టీని నమ్ముకుని పని చేస్తున్నవాళ్లు ఉన్నారని ఆయన అన్నారు.

తాను కూడా నమ్ముకున్న పార్టీలోనే ఉన్నానని చెప్పారు. బీజేపీ దేశానికి అవసరమని, కాంగ్రెస్ పార్టీ శకం ముగిసిందన్నారు. బీజేపీ పురోగతిని ప్రతిపక్షాలు ఓర్వడం లేదని, అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రపంచ చరిత్రలో అతిపెద్ద పార్టీగా బీజేపీ ఉండనుందన్నారు. ఓటు రాజకీయాలతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ చీల్చిందన్నారు. బీజేపీ సభ్యత్వాన్ని గౌరవంగా భావించాలన్నారు.
సర్వ హంగులతో ఏపీ రాజధాని ఏర్పాటుకు రైతులు సహకరించాలని కోరారు. రాజధాని ఏర్పాటులో రైతు శ్రేయస్సే ప్రధానమైనదన్నారు. రాజధానిని స్మార్ట్ సిటీగా చేసే బాధ్యత కేంద్రానిదేనని చెప్పారు. రైతుల రక్షణ పైన ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. రాజధానికి ప్రత్యామ్నాయం తాను ఎప్పుడు సూచించలేదన్నారు.












Click it and Unblock the Notifications