Driving Licenses కొత్త రూల్స్.. గ్రేడ్లు పోతే శాశ్వతంగా లైసెన్స్ రద్దు!
రహదారిపై మీ ప్రయాణం సురక్షితంగా సాగాలన్నా.. మీ జేబుకు చిల్లు పడకుండా ఉండాలన్నా ఇకపై డ్రైవింగ్ విషయంలో రూల్స్ మార్చుకోవాల్సిందే! రోడ్లపై ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపే వారికి చుక్కలు చూపించేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త 'గ్రేడెడ్ పాయింట్ సిస్టమ్' (Graded Point System) లైసెన్స్ విధానాన్ని తీసుకువస్తోంది.
మీ బండిని రొడ్డేక్కిస్తున్నారా? అయితే ఇకపై మీ డ్రైవింగ్ స్టైల్ మార్చుకోక తప్పదు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే కేవలం జరిమానా కట్టి చేతులు దులుపుకుందామనుకుంటే పొరపాటే. మీ డ్రైవింగ్ లైసెన్స్‌పై ప్రభుత్వ నిఘా మొదలవ్వబోతోంది. దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సరికొత్త 'గ్రేడెడ్ పాయింట్ సిస్టమ్'ను ప్రవేశపెడుతున్నారు.

Driving Licenses కఠిన నిబంధనలు..
గ్రేడెడ్ పాయింట్ సిస్టమ్ ప్రకారం, మీరు చేసే ప్రతి ట్రాఫిక్ ఉల్లంఘనకు మీ లైసెన్స్ నుండి పాయింట్లు కోత పడతాయి. ఒకవేళ మీ ఖాతాలో పాయింట్లు సున్నాకి చేరితే, మీ లైసెన్స్ ఆరు నెలల పాటు సస్పెండ్ అవుతుంది. పదేపదే నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసేలా కఠిన నిబంధనలు రూపొందిస్తున్నారు.
పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు..
భారతదేశ రహదారులు మృత్యుకూపాలుగా మారుతున్నాయని మంత్రి గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా దేశంలో 5 లక్షల ప్రమాదాలు జరుగుతుంటే, సుమారు 1.8 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే రోజుకు సగటున 500 మంది రోడ్లపై విగతజీవులవుతున్నారు. వీరందరిలోనూ 72 శాతం మంది 18 నుండి 45 ఏళ్ల లోపు యువతే ఉండటం అత్యంత విషాదకరం. అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, రాంగ్ రూట్‌లో ప్రయాణించడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి చిన్న చిన్న నిర్లక్ష్యాలే వేల కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపుతున్నాయి. కేవలం హెల్మెట్ లేకపోవడం వల్ల 54 వేల మంది, సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్ల 14 వేల మంది మరణించడం మన డ్రైవింగ్ క్రమశిక్షణను ప్రశ్నిస్తోంది.
ప్రమాద సమయంలో.. పీఎం రాహత్
కేవలం కఠిన చట్టాలే కాకుండా, ప్రమాద బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం 'పీఎం రాహత్' (PM RAHAT) అనే అభయహస్తాన్ని అందిస్తోంది. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఏ ఆసుపత్రిలో చేరినా, మొదటి ఏడు రోజుల పాటు బాధితునికి రూ. 1.5 లక్షల వరకు నగదు రహిత (Cashless) చికిత్సను ఈ పథకం ద్వారా అందిస్తారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి బాధితులను ఆసుపత్రికి చేర్చే 'మంచి సమరయుల' (Good Samaritans) కు ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు లేకుండా రక్షణ కల్పిస్తున్నామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ఇకనైనా రోడ్డు భద్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.












Click it and Unblock the Notifications