షిండేకు చుక్కెదురు? తాడో- పేడో..!!
New Maharashtra CM: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి రోజులు గడుస్తోన్నప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి ఎవరనేది తేలట్లేదు. ముఖ్యమంత్రి పీఠంపై పీటముడి పడింది. ప్రతిష్ఠంభన కొనసాగుతూనే వస్తోంది. మహారాష్ట్రతో పాటే ఎన్నికలను ఎదుర్కొన్న జార్ఖండ్‌లో గురువారం కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోన్నప్పటికీ ఇక్కడ మాత్రం జాప్యం జరుగతోంది.
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో స్పష్టత రావాట్లేదు. భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం నాన్చుడు ధోరణిని ప్రదర్శిస్తోంది. వరుసగా రెండోసారి ఏక్‌నాథ్ షిండేకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలంటూ శివసేన పట్టుబట్టడం దీనికి ప్రధాన కారణం.

సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 145 సీట్ల సంఖ్యా బలం బీజేపీకి లేదు. 149 సీట్లల్లో పోటీ చేసి 132 చోట్ల గెలిచిందీ పార్టీ. షిండే వర్గం శివసేన 81 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టగా 57 మంది గెలుపొందారు. అజిత్ వర్గానికి చెందిన ఎన్సీపీ మొత్తం 59 స్థానాల్లో పోటీ చేయగా 41 సీట్లు ఈ పార్టీ ఖాతాలో పడ్డాయి.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మిత్రపార్టీల మద్దతు తప్పనసరి కావడంతో ముఖ్యమంత్రి పదవి కోసం శివసేన భీష్మించింది. శివసేన మహిళా అధికార ప్రతినిధి శీతల్ మ్హాత్రే ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. మహారాష్ట్ర ఓటర్లు, పార్టీ క్యాడర్ మొత్తం కూడా షిండే నాయకత్వాన్ని కోరుకుంటోందని స్పష్టం చేశారు.
దీనితో ముఖ్యమంత్రిగా ఎవరిని ప్రకటించాలనే విషయం మీద ప్రతిష్ఠంభన నెలకొంది. బీజేపీ అధిష్ఠానం మాత్రం ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వైపే మొగ్గు చూపుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ దఫా సీఎం పదవి తమ పార్టీకే దక్కాలనే పట్టుదలతో ఉంది. ఇదే విషయాన్ని శివసేనకూ తేల్చి చెప్పింది.

కొత్త మంత్రివర్గ కూర్పు ఎలా ఉండాలనే విషయంపైనా ఓ స్పష్టత ఉంది బీజేపీలో. 21 బెర్తులను తీసుకోనున్నారు కమలనాథులు. శివసేనకు 12, అజిత్ పవార్ ఎన్సీపీకి 10 పోర్ట్‌ఫోలియోలనూ కేటాయించాలని నిర్ణయించింది కూడా. దీనికి కూడా అంగీకరించట్లేదు శివసేన.
తక్కువ సీట్లే ఉన్నప్పటికీ- బిహార్‌లో జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీష్ కుమార్‌ను ముఖ్యమంత్రిగా కొనసాగిస్తోన్న ఫార్ములాను ఇక్కడా అమలు చేయడానికి బీజేపీ ససేమిరా అంటోంది. అలాంటి ఆలోచనే చేయట్లేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా కుండబద్దలు కొట్టారు.












Click it and Unblock the Notifications