కాన్పూర్ ఎయిర్ పోర్టులో కొత్త టెర్మినల్ ప్రారంభం- 16 రెట్లు పెద్దగా- స్ధానికులకు గిఫ్ట్ అన్న యోగీ..
యూపీలో వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు అభివృద్ధిని పరుగులు పెట్టించాలని భావిస్తున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్.. పలు ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. వాటికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టడంతో పాటు రాష్ట్రం తరఫున నిధులు కేటాయిస్తూ వాటిని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇదే క్రమంలో కాన్పూర్ ఎయిర్ పోర్టులో కొత్త టెర్మినల్ భవనాన్నికూడా ప్రారంభించారు. గతంలో ఉన్న టెర్మినల్ కంటే 16 రెట్లు ఎక్కువ సామర్ద్యంతో ఇది పనిచేయబోతోంది.
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో పాటు కేంద్ర పౌర విమానయానశాఖ అందించిన సహకారంతో కాన్పూర్ ఎయిర్ పోర్టులో కొత్త టెర్మినల్ నిర్మాణం పూర్తి చేసుకుంది. దీన్ని ఏఏఐ ఛైర్మన్ సంజీవ్ కుమార్, కేంద్రమంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, వీకే సింగ్ లతో కలిసి ఈ టెర్మినల్ ను సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రారంభించారు. కాన్పూర్ ఎయిర్ పోర్టు రూపురేఖల్ని మారుస్తుందని భావిస్తున్న ఈ టెర్మినల్ స్ధానికులకు గిఫ్ట్ అని యోగీ తెలిపారు.

2017లో తాను అధికారంలోకి వచ్చే నాటికి యూపీలో రెండు ఎయిర్ పోర్టులు మాత్రమే ఉండేవని, అవి కూడా పూర్తి స్ధాయిలో పనిచేయడం లేదని, కానీ ఇప్పుడు 9 ఎయిర్ పోర్టులు పూర్తి స్ధాయిలో పనిచేస్తున్నాయని, మరో డజను విమానాశ్రయాలు వివిధ దశల్లో ఉన్నాయని సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ ప్రాంతంలో కొత్తగా డిఫెన్స్ కారిడార్ నిర్మాణం ద్వారా ప్రధాని నరేంద్రమోడీ .. కాన్పూర్ కు పునర్ వైభవం తీసుకున్నట్లు యోగీ వెల్లడించారు.

కాన్పూర్ లో మెట్రో తర్వాత ఎయిర్ పోర్టు ఉండాలన్న స్ధానికుల కలను కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ, సీఎం యోగీ నెరవేర్చినట్లు పౌరవిమానయానమంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. భవిష్యత్తులో కాన్పూర్ ఎయిర్ పోర్టులో అన్ని సదుపాయాలు కల్పిస్తామని, ఇక్కడి నుంచి దేశీయ విమానాలతో పాటు అన్ని సర్వీసుల్ని నడుపుతామన్నారు. పారిశ్రామిక నగరంగా మారుతున్న కాన్పూర్ లో ప్రజల అవసరాలకు తగినట్లుగా దీన్ని అభివృద్ధి చేస్తామని సింధియా ప్రకటించారు.












Click it and Unblock the Notifications