గెలిచిన మూడో రోజే పార్టీ ఫిరాయింపు- బీజేపీలో చేరనున్న ఆప్ ఎమ్మెల్యే..!!
అహ్మదాబాద్: ఇటీవలే వెలువడిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీని నిండా ముంచాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న గుజరాత్‌లో ఘోర పరాజయాన్ని చవి చూసిందా పార్టీ. కనీస ప్రతిఘటన కూడా ఇవ్వలేకపోయింది. పూర్తిగా చేతులెత్తేసింది. అయిదు స్థానాల్లో మాత్రమే గెలిచింది. 182 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ రికార్డుస్థాయి మెజారిటీని సాధించింది. 156 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థులు 17 చోట్ల మాత్రమే గెలిచారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గెలిచిన వారిలో ఛైతర్ వసావ-దేడియాపాడా, భూపత్ భయానీ-విసావదార్, హేమంత్ ఖావా-జంజోధ్‌పూర్, ఉమేష్ మక్వాణా-బొటాడ్, సుధీర్ వాఘాని-గరియాధర్ ఉన్నారు. ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గఢ్వీ సైతం ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. మొత్తం పోల్ అయిన ఓట్లల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వాటా 13 శాతానికి పరిమితమైంది.

కాగా- ఇప్పుడు కొత్తగా గెలిచిన అయిదుమంది శాసన సభ్యుల్లో అప్పుడే ఒకరు పార్టీ ఫిరాయించడానికి సన్నాహాలు పూర్తి చేశారు. జునాగఢ్ జిల్లాలోని విసావదార్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన భూపత్ భయానీ- బీజేపీలో చేరబోతోన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ సాయంత్రమే ఆయన అహ్మదాబాద్‌లో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ను కలిసి బీజేపీ కండువాను కప్పుకోనున్నారు.
ఇదివరకు కాంగ్రెస్ పార్టీలో పని చేసిన భూపత్ భయానీ ఆ తరువాత బీజేపీలో చేరారు. ఆయనకు టికెట్ లభించే పరిస్థితి లేకపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. విసావదార్ స్థానం నుంచి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థిని 7,063 ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. ఫలితాలు వెలువడిన మూడో రోజే పార్టీని ఫిరాయించనున్నారు. ఎమ్మెల్యేగా ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చెయ్యకముందే పార్టీ ఫిరాయించబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications