లష్కరే ఉగ్రవాదులకు కీలక సమాచారం చేరవేత: ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
న్యూఢిల్లీ: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) శుక్రవారం దాని మాజీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ), ఐపీఎస్ అధికారి అరవింద్ దిగ్విజయ్ నేగీని అరెస్టు చేసింది. నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన గ్రౌండ్ వర్కర్‌కు రహస్య పత్రాలను లీక్ చేసినట్లు మాజీ ఎస్పీపై ఆరోపణలు ఉన్నాయని ఎన్ఐఏ అధికార ప్రతినిధి తెలియజేసినట్లు వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది.
గత ఏడాది నవంబర్ 6న ఎన్ఐఏ నమోదు చేసిన కేసుకు సంబంధించి అరవింద్ నేగీని అరెస్టు చేసినట్లు అధికార ప్రతినిధి తెలిపారు. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాల ప్రణాళిక, అమలులో మద్దతునిచ్చే నిషేధిత లష్కరే తోయిబా (LeT) ఓవర్ గ్రౌండ్ వర్కర్ల (OGWs) నెట్‌వర్క్ వ్యాప్తికి సంబంధించినది ఈ కేసు.

'విచారణ సమయంలో, సిమ్లాలో (NIA నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి) అరవింద్ దిగ్విజయ్ నేగి,ఐపీఎస్, ఎస్పీ పాత్ర ధృవీకరించబడింది. అతని ఇళ్లలో సోదాలు జరిగాయి. ఈ కేసులో ఎల్‌ఇటి(లష్కరే తొయిబా)కి చెందిన ఓజిడబ్ల్యుగా ఉన్న మరో నిందితుడికి నేగి ఎన్‌ఐఎ అధికారిక రహస్య పత్రాలను లీక్ చేసినట్లు కూడా కనుగొనబడింది'అని ప్రతినిధి పిటిఐకి తెలిపారు.
పోలీసు అధికారి 2011 ఐపీఎస్ బ్యాచ్‌గా పదోన్నతి పొందారు.
ఈ కేసులో గతంలో ఎన్‌ఐఏ ఆరుగురిని పట్టుకోవడం గమనార్హం.
ఖుర్రం పర్వేజ్‌కు అరవింద్ నేగి సమాచారం అందించినట్లు అనుమానిస్తున్నారు: నివేదిక
నవంబర్‌లో ఇండియా టుడే నివేదిక ప్రకారం, అరవింద్ నేగి జమ్మూ, కాశ్మీర్‌లోని అనేక ఉగ్రవాద సంబంధిత కేసులపై దర్యాప్తుకు నాయకత్వం వహించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద అరెస్టు చేయబడిన కార్యకర్త ఖుర్రం పర్వేజ్‌కు అతను సున్నితమైన సమాచారాన్ని పంపించి ఉంటాడని ఏజెన్సీ అనుమానించడంతో అతను పరిశీలనలో ఉన్నాడు. కీలక విషయాలు ఉగ్రవాదులకు చేరవేశాడనే విషయం తెలిసి ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖకు తెలియజేశామని సదరు అధికారి తెలిపారు.












Click it and Unblock the Notifications