డిసెంబర్ 8 వరకు ఎన్ఐఎ కస్టడీకి ఆరిఫ్, అరెస్టు వేధింపుల చర్య కాదు: హోం మంత్రి
న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, సిరియా ఉగ్రవాద సంస్ధలతో చేతులు కలిపేందుకు వెళ్లి తిరిగొచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరిఫ్ మజిద్ (22)ను న్యాయస్ధానం డిసెంబర్ 8 వరకు జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్ఐఏ)కు అప్పగించింది. ముంబైలోని కళ్యాణ్ ప్రాంతానికి చెందిన ఆరిఫ్ మజిద్‌ను ఎన్ఐఏ శుక్రవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆరిఫ్‌పై కేసు నమోదు చేసి శనివారం న్యాయస్ధానంలో హాజరుపరిచారు. దేశ భద్రతకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు తమకు అప్పగించాలని న్యాయస్ధానాన్ని ఎన్ఐఎ కోరడంతో న్యాయస్ధానం కస్టడీకి ఆదేశించారు.
వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని థానే జిల్లా కళ్యాణ్‌కు చెందిన ఆరిఫ్ మజిద్ తన ముగ్గురు స్నేహితులు అమన్ తండెల్, ఫహాద్ షేఖ్, సహీమ్ తన్కీలతో కలిసి ఆర్నెల్లు కిందట కళ్యాణ్ నుంచి పశ్చియ ఆసియాలోని పవిత్ర క్షేత్రాలను సందర్శనకు వెళ్లాడు.
అనంతరం ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, సిరియాలో చేరారు. నలుగురు యువకులు కుటుంబ ఆర్ధిక స్ధితి బాగానే ఉన్నా... ఉగ్రవాదంలో చేరేందుకు సిరియా వెళ్లినట్లు తేలింది. యువకులు తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నట్లు అంగీకరించి తరిగి భారత్‌కు రప్పించేందుకు ఆరిఫ్ మజీద్ తండ్రి డాక్టర్ ఎజాజ్ మసీద్, మిగిలిన ముగ్గురు యువకుల బంధువులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
దీంట్లో భాగంగా కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్‍ను కూడా కలిశారు. అప్పటి నుంచి యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతలోనే సిరియా ఓ మసీదు సమీపంలో జరిగిన బాంబు పేలుళ్లలో ఆరిఫ్ మృతి చెందినట్లు సమాచారం అందింది. దీంతో ఆతని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరిఫ్ ఆత్మశాంతి కోసం సంప్రదాయ ప్రార్ధనలు కూడా చేశారు.

ఐతే నలుగురు యువకులు ప్రాణాలతో ఉన్నారని... భారత్‌కు తిరిగొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఇంటిలిజెన్స్ బ్యూరో, 'రా'కు కొద్ది రోజుల క్రితం రహస్య సమాచారం అందింది. ఇంతలోనే ఆరిఫ్ ఎలాగో సిరియా శిబిరం నుంచి తప్పించుకుని తండ్రికి ఫోన్ చేసి భారత్‌కు వస్తున్నట్లు చెప్పాడు.
ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారంతో ఆరిఫ్ తండ్రి హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్‌ను కలుసుకుని అందజేశారు. అనంతరం ఇంటిలిజెన్స్ బ్యూరో సహకారంతో ఆరిఫ్ ముంబైకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. తుక్ స్తాన్‌లో ఆరిఫ్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇంటిలిజెన్స్ బ్యూరో అధికారులు శుక్రవారం తెల్లవారుజామున ముంబైకి తీసుకొచ్చారు.
ఇక ఆరిఫ్ మజిద్ అరెస్టు వేధింపుల చర్య కాదని.. ఇలాంటి కేసుల్లో అంశాల వారీ ప్రాతిపదికనే వ్యవహరిస్తామని కేంద్ర ప్రభుత్వం శనివారం స్పష్టం చేసింది. హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ మాట్లాడుతూ ఎవరినీ వేధించడం మా ఉద్దేశం కాదు.. ఇలాంటి వ్యవహారాల్లో అంశాల వారీ ప్రాతిపదికనే చర్యలు చేపడతామని అన్నారు.












Click it and Unblock the Notifications