కరోనా ఉధృతి: బెంగళూరుతోపాటు ఆరు నగరాల్లో నైట్ కర్ఫ్యూ, ఏప్రిల్ 10 నుంచి అమలు
బెంగళూరు: కర్ణాటకలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరుతోపాటు మరో ఆరు నగరాల్లో నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ కొనసాగనుంది. వచ్చే శనివారం నుంచి ఈ కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని సీఎం తెలిపారు.
ముఖ్యమంత్రుల సమావేశంలో కరోనా కట్టడికి అవసరమైతే ఆంక్షలు విధించాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ సూచించిన గంటల వ్యవధిలోనే కర్ణాటక ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. బెంగళూరుతోపాటు మైసూరు, మంగళూరు, కలబురగి, బీదర్, తమకూరు, మణిపాల్ నగరాల్లో నైన్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు సీఎం యడ్యూరప్ప తెలిపారు.

అత్యవసరాలకు మాత్రమే ఈ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉందని చెప్పారు. కర్ణాటక రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కర్ణాటక రాష్ట్రంలో 6570 కరోనా కేసులు నమోదు కాగా, 2393 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 36 మంది మహమ్మారిన పడి మరణించారు. కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటి వరకు 10,40,130 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 9,73,949 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 12,767 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 53,395 యాక్టివ్ కేసులున్నాయి.
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న పది రాష్ట్రాల్లో కర్ణాటక కూడా ఉంది. మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో ఇటీవల కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కరోనా కేసుల్లో విపరీతంగా పెరుగుదల నమోదవుతోంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1.26 లక్షల కేసులు నమోదు కావడం గమనార్హం. మరోవైపు తమిళనాడు రాష్ట్రంలో కూడా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నాయి.