బ్యాంక్ అకౌంట్ లేకపోయినా నగదు పంపొచ్చు, తీసుకోవచ్చు..! లిమిట్స్ ఇవే: ఆర్బీఐ
మన దేశంలో బ్యాంక్ ఖాతాలు ఉన్న (Bank Account) ఖాతాదారులు ఇప్పుడు ఎన్నో విధాలుగా ఇతరులకు నగదు పంపించేందుకు వీలుంది. అయితే బ్యాంక్ ఖాతాలు లేని వారు ఓ బ్యాంక్ ఖాతా ఉన్నవారికి నగదు ఎలా పంపించవచ్చు, ఎంత వరకూ పంపించవచ్చు, అలాగే బ్యాంక్ ఖాతా లేని వారికి బ్యాంక్ ఖాతా ఉన్న వారి నుంచి ఎంత వరకూ నగదు స్వీకరించవచ్చు, ఎలా స్వీకరించవచ్చనే దానికి ఆర్బీఐ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఎప్పటి నుంచో ఉన్న ఈ నిబంధనల్ని ఆర్బీఐ ఇప్పుడు క్రోడీకరించింది.
బ్యాంక్ ఖాతా లేని వారు కూడా సమీపంలోని ఏదైనా బ్యాంక్ కు వెళ్లి బ్యాంక్ ఖాతా కలిగిన మిత్రులు, దూరంగా ఉండే కుటుంబ సభ్యులు, ఇలా ఎవరికైనా ప్రతిసారీ 50 వేల వరకూ నగదు పంపుకోవచ్చు. దీన్ని నెఫ్ట్ ద్వారా బ్యాంక్ సదరు బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తుంది. అయితే ఇలా బ్యాంక్ నుంచి కాకుండా ఏటీఏం నుంచి కానీ లేదా నగదు బదిలీ చేసే బ్యాంక్ ఏజెంట్లు (బిజినెస్ కరస్పాండెంట్ లు) దగ్గర అయితే ఐదుసార్లు 5 వేలు చొప్పున నెలకు 25 వేలు మాత్రమే ఇలా బదిలీ చేసుకునేందుకు వీలుంటుంది.

అలాగే బ్యాంక్ ఖాతా లేని వ్యక్తి బ్యాంక్ కు వెళ్లి ఇతరులు తనకు పంపిన డబ్బును తీసుకునేందుకు కూడా ఆర్బీఐ వీలు కల్పిస్తోంది. ఇందుకోసం బ్యాంక్ ఖాతా ఉన్న వ్యక్తి క్యాష్ పే -అవుట్ సర్వీస్ ద్వారా పంపవచ్చు. ఈ నగదును తీసుకునే వారు ఏటీఎం లేదా బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా కూడా పొందవచ్చు. ఇలా ఒకే లావాదేవీలో గరిష్టంగా 10 వేల వరకూ మాత్రమే పొందే అవకాశం ఉంది. ఒక నెలలో అయితే మొత్తం 25 వేల వరకూ మాత్రమే పొందవచ్చు. బ్యాంకింగ్ సేవల్ని పొందేందుకు ఇబ్బందులు ఎదుర్కునే వలస కార్మికుల కోసం ఆర్బీఐ ఈ నిబంధనలు అమలు చేస్తోంది. వీటిని ఆర్బీఐ మరోసారి ఒకే చోటకు చేర్చి తాజాగా విడుదల చేసింది. ఈ నిబంధనల అమలు విషయంలో బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ కోరుతోంది.














Click it and Unblock the Notifications
