విలీనానికి నో: మోడీకే మద్దతన్న యడ్యూరప్ప
హుబ్లి: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, కర్నాటక జనతా పక్ష(కెజెపి) అధ్యక్షుడు బిఎస్ యడ్యూరప్ప తన సొంతగూడు భారతీయ జనతా పార్టీకి చేరతారని వస్తున్న వార్తలను ఖండించారు. హుబ్లిలో గురువారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. బిజెపిలో మళ్లీ చేరే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి తమ మద్దతు ఉంటుందని తెలిపారు.
కాగా యడ్యూరప్ప బిజెపిని వీడడం వల్ల గత కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి భారీ మొత్తంలో సీట్లను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషిస్తున్న అనంతకుమార్, యడ్యూరప్పల నాయకత్వంలోని భేదాలను పోల్చుతూ యడ్యూరప్ప లేనిలోటు తమ పార్టీలో స్పష్టంగా కనిపిస్తోందని బిజెపి భావిస్తోంది.

గత కొంత కాలంగా యడ్యూరప్పను తిరిగి తమ పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలను బిజెపి కొనసాగిస్తోంది. అయితే ప్రస్తుతం యడ్యూరప్ప చేసిన ఈ ప్రకటన బిజెపి ప్రయత్నాలకు స్వస్తి పలికేలా ఉంది. వచ్చే ఎన్నికల్లో 10 లోక్ సభ స్థానాలకు తమ పార్టీ పోటీ చేస్తుందని యడ్యూరప్ప స్పష్టం చేశారు. మైనింగ్ కార్యకలాపాలను అక్రమంగా కొనసాగించారనే లోకాయుక్త ఆరోపణల నేపథ్యంలో బిజెపి పాలనలో ముఖ్యమంత్రి పదవి నుంచి యడ్యూరప్పను తప్పించిన విషయం తెలిసిందె. దీంతో యడ్యూరప్ప బిజెపిని వీడి కెజెపిని ఏర్పాటు చేశారు.
ఇది ఇలా ఉండగా తమ పార్టీ.. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతు పలుకుతుందని యడ్యూరప్ప స్పష్టం చేశారు. దేశంలోని 70శాతం ప్రజలు మోడీని ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, చైనాల నుంచి దేశానికి ముప్పు పొంచివున్న ప్రస్తుత పరిస్థితుల్లో నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ప్రధానమంత్రి కావాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications