మోడీ గెలిస్తే ఇక ఎన్నికలుండవ్- కాంగ్రెస్ ఛీఫ్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు..!
దేశంలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమి మధ్య మాటల యుద్ధం కూడా ముదురుతోంది. ముఖ్యంగా ప్రధాని మోడీని, బీజేపీని టార్గెట్ చేస్తూ ఇండియా కూటమి నేతలు చెలరేగిపోతున్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ నియంతృత్వాన్ని గుర్తుచేస్తూ ఖర్గే ఇవాళ చేసిన వ్యాఖ్యలు రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశమయ్యాయి.
దేశంలో ప్రధాని మోడీ నియంతృత్వం పెరిగిపోతోందంటూ ఇవాళ ఒడిశాలోని భువనేశ్వర్ లో జరిగిన ఓ ర్యాలీలో కాంగ్రెస్ ఛీఫ్ మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. అంతే కాదు మరోసారి మోడీ గెలిస్తే ఇక దేశంలో ఎన్నికలు ఉండబోవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాలో పుతిన్ తరహాలో శాశ్వత అధ్యక్షుడిగా మోడీ మారిపోతారంటూ ఖర్గే హెచ్చరించారు. కాబట్టి ప్రజలు ఈసారి ఆలోచించి ఓటేయాలని ఖర్గే సూచించారు.

ప్రజలకు ప్రజాస్వామ్యం అవసరం అనుకుంటే దాన్ని కాపాడుకోవాలని మల్లిఖార్జున ఖర్గే పిలుపునిచ్చారు. లేకపోతే బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో ఉన్నట్లు బానిసత్వంలో ఉండాల్సి వస్తుందని ఆయన ప్రజల్ని హెచ్చరించారు. మరోవైపు జేడీయూ నేత నితీశ్ కుమార్ వెళ్లిపోవడం వల్ల ఇండియా కూటమికి వచ్చిన నష్టమేమీ లేదని ఖర్గే తెలిపారు. ఒక నేత వెళ్లిపోతే దేశం బలహీనం కాదని, అలాగే కూటమి కూడా బలహీనం కాబోదన్నారు. తాము మరింత బలపడటం ద్వారా బీజేపీతో పాటు ఒడిశాలో పట్నాయక్ ను ఓడించేందుకు ప్రయత్నిస్తామన్నారు.












Click it and Unblock the Notifications