యోగి ఎఫెక్ట్: అక్కడ ఇక ‘నో హెల్మెట్.. నో పెట్రెల్!’
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో అనేక సంస్కరనలు తెస్తున్న విషయం తెలిసిందే.
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో అనేక సంస్కరనలు తెస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, ఆయన ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. హెల్మెట్ లేకుండా బంక్‌లకు వచ్చే వారికి పెట్రోల్ విక్రయించొద్దని నిర్ణయం తీసుకుంది.
ఈ సోమవారం(మే22) నుంచే ఈ విధానాన్ని లక్నోలో అమల్లోకి తీసుకొచ్చింది. హెల్మెట్ లేకుండా బైక్‌లు నడిపే వారిని నియంత్రించేందుకు యూపీ ప్రభుత్వం 'నో హెల్మెట్, నో ఫ్యూయల్' నిబంధన తీసుకొచ్చింది. దీని ప్రకారం.. హెల్మెట్ లేకుండా ఎవరైనా బైక్ నడుపుతూ పెట్రోల్ కోసం వస్తే.. వారికి ఇంధనం విక్రయించకూడదని లక్నోలోని పెట్రోల్ బంక్ యజమానులకు సూచించింది.

అంతేగాక, ఆ బైక్ నంబర్లను నోట్ చేసి.. పోలీసులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విధానంపై పెట్రోల్‌బంక్ సిబ్బందికి అవగాహన కల్పిస్తూ పోలీసు శాఖ మే 18నుంచి 20వ తేదీ వరకు మూడు రోజుల పాటు ట్రయల్‌రన్ నిర్వహించింది. ఆ తర్వాత ఈ సోమవారం నుంచి వారంపాటు 'నో హెల్మెట్ - నో ఫ్యూయల్' నిబంధన కొనసాగుతుంది.
ఆ తర్వాత ప్రతి బంకు వద్ద ఎస్సై ర్యాంకు పోలీసు అధికారిని నియమిస్తారు. హెల్మెట్ లేకుండా కన్పిస్తే.. చలానాలు జారీ చేస్తారు. ఇది విజయవంతమైతే.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ నిబంధనను అమల్లోకి తీసుకొచ్చేందుకు యోగి ప్రభుత్వం యోచిస్తోంది.












Click it and Unblock the Notifications