Rahul Gandhi : రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులోనూ దక్కని ఊరట..!
కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మోడీ పేరుతో చేసిన వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ, స్టే ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు గుజరాత్ హైకోర్టులో సింగిల్ జడ్జి బెంచ్ ఇవాళ తీర్పు వెలువరించింది. దీంతో సూరత్ కోర్టు తీర్పుపై రాహుల్ చేసిన స్టే విజ్ఞప్తిపై ఆయనకు ఊరట లభించలేదు.

2019 ఎన్నికల సమయంలో కర్నాటకలో ప్రచారం చేస్తూ మోడీ ఇంటి పేరున్న వాళ్లంతా దొంగలేనా అంటూ రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ పై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సూరత్ కోర్టు.. ఈ ఏడాది తీర్పు వెలువరించింది. ఈ కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారిస్తూ ఆయనకు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. దీంతో రాహుల్ గాంధీ ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం తన ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయారు.
అనంతరం ఆయన సూరత్ కోర్టు తీర్పును జిల్లా కోర్టులో సవాల్ చేశారు. అయితే అక్కడ ఊరట దక్కలేదు. దీంతో గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని రాహుల్ గాంధీ కోరారు.అయితే సింగిల్ జడ్జి బెంచ్ ఆయన అభ్యర్ధనను మన్నించలేదు. రాహుల్ గాంధీకి విధించిన జైలుశిక్షపై స్టే ఇచ్చేందుకు ఎలాంటి సహేతుకమైన కారణాలు కనిపించడం లేదని గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు.
గుజరాత్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై రాహుల్ గాంధీ ఇప్పుడు డివిజన్ బెంచ్ కు అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. అక్కడా కుదరకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి. వచ్చేఏడాది సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో రాహుల్ గాంధీకి ఈ కేసు సమస్యగా మారింది. ఈ కేసులో కోర్టులు రాహుల్ జైలుశిక్షను సమర్ధిస్తే జైలు జీవితం కూడా గడపక తప్పదు. అసలే వివక్షాల్ని ఏకం చేసేందుకు రాహుల్ చేస్తున్న ప్రయత్నాలకు కూడా ఈ కేసు సమస్యగా మారబోతోంది.












Click it and Unblock the Notifications