Delhi Polls: బీజేపీ గెలిస్తే ఢిల్లీలో అవన్నీ మాయం-కేజ్రివాల్ హెచ్చరిక..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలైన ఆప్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా ఆప్ ను మరోసారి అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకోవాలని శతవిథాలా ప్రయత్నిస్తున్న బీజేపీకి కేజ్రివాల్ అడ్డంకిగా నిలిచారు. దీంతో ఆయన్ను టార్గెట్ చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో కేజ్రివాల్ కూడా ఆయనకు అంతే దీటుగా కౌంటర్ ఇచ్చారు.
ఫిబ్రవరి 5న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మురికివాడలనేవి లేకుండా చేసేస్తుందని ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఓటర్లను హెచ్చరించారు. బీజేపీ అద్దాల మేడగా అభివర్ణిస్తున్న కేజ్రివాల్ అధికారిక నివాసంలో విలాసవంతమైన టాయిలెట్లు కట్టుకున్నారంటూ అమిత్ షా తాజాగా విమర్శలు గుప్పించారు. ఇవి ఢిల్లీలో మురికివాడల కంటే ఎంతో విలాసవంతమైనవిగా అభివర్ణించారు. దీనికి కౌంటర్ గా కేజ్రివాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ ఐదేళ్లుగా మురికివాడల ప్రజలను విస్మరించిందని, ఓట్ల కోసం ఎన్నికల సమయంలో మాత్రమే వారి గురించి మాట్లాడుతుందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలోని షకుర్‌బస్తీ ప్రాంతంలోని మురికివాడల్లో కేజ్రివాల్ పర్యటించారు. అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి మురికివాడలంటే ఇష్టం లేదని, అది సంపన్నుల పార్టీ అని కేజ్రివాల్ విమర్శించారు. మురికివాడల్లో నివసించే వారితో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, అక్కడ నివసించే వారిని కాషాయ నేతలు క్రిమికీటకాలుగా భావిస్తారని, వారికి ఓట్లు కావాలని కేజ్రివాల్ ఆరోపణలు చేసారు.












Click it and Unblock the Notifications