దేశంలో 1000 దాటిన కరోనా జేఎన్.1 వేరియంట్ కేసులు: ఏపీ, తెలంగాణలో ఎన్నంటే?
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ కొత్త వేరియంట్ జేఎన్.1 (JN.1) కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో 1013 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. తాజాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఈ వేరియంట్ వ్యాప్తి చెందినట్లు 'ఇండియన్ సార్స్‌కోవ్-2' జీనోమిక్స్ కన్సార్టియం తెలిపింది.
'ఇండియన్ సార్స్‌కోవ్-2' జీనోమిక్స్ కన్సార్టియం (INSACOG) గణాంకాల ప్రకారం.. అత్యధికంగా కర్ణాటక రాష్ట్రంలో 214 కేసులు నమోదు కాగా, మహారాష్ట్ర 70, కేరళ 154, ఆంధ్రప్రదేశ్ 189, గుజరాత్ 76, గోవా 66, తెలంగాణ, రాజస్థాన్ 32 చొప్పున కేసులు నమోదుయ్యాయి. ఛత్తీస్‌గఢ్ 25, తమిళనాడు 22, ఢిల్లీ 16, ఉత్తరప్రదేశ్ 6, హర్యానా 5, ఒడిశా 3, పశ్చిమబెంగాల్ 2, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒకటి చొప్పున కేసులు గుర్తించినట్లు పేర్కొంది.

కాగా, గురువారం ఒక్కరోజే దేశంలో 609 కొత్త కేసులు నమోదు కాగా.. కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 3368 యాక్టివ్ కేసులు ఉన్నాయి. సాధారణ కరోనా వైరస్ కేసులతోపాటు కొత్త వేరియంట్ జేఎన్.1 వేరియంట్ కేసులు పెరుగుతుండటంపై ఇప్పటికే రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ వేరియంట్‌పై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించింది. కొత్త వేరియంట్ ను ఎదుర్కొనేందుకు కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించింది.
జేఎన్.1 వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ.. పెద్దగా ప్రమాదకరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇతర వ్యాధులతో బాధపడుతుండేవారు మాత్రం ఈ వేరియంట్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కాగా, జేఎన్.1 వేరియంట్ ను ప్రత్యకమైన 'వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్'గా ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ కూడా ఈ వేరియంట్ అంతగా ప్రమాదకరం కాదని తెలిపింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.












Click it and Unblock the Notifications