యుద్ధం వేళ.. భారత్ దూకుడు.. ప్రపంచంలోనే టాప్ లోకి
ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల్లో భారత్ వేగంగా దూసుకుపోతోంది. భారత దేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందని ఆర్థిక సహకార మరియు అభివృద్ధి సంస్థ (OECD) స్పష్టం చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారత జిడిపి వృద్ధి రేటు 7.6 శాతంగా అంచనా వేయగా, 2026-27 నాటికి 6.1 శాతం, 2027-28 నాటికి అది 6.4 శాతంగా నమోదు కావచ్చని OECD తన తాజా నివేదికలో పేర్కొంది. అయితే, మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న కల్లోల పరిస్థితులు ప్రపంచ ఆర్థిక గమనాన్ని పరీక్షిస్తున్నాయి.
హార్ముజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోవడం, ఇంధన మౌలిక సదుపాయాలు దెబ్బతినడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధనం, ఎరువులు వంటి కీలక వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయి. దీనివల్ల సరఫరా గొలుసులో అంతరాయాలు ఏర్పడి, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణ భారం, వినియోగ డిమాండ్ తగ్గడం వంటి సవాళ్లు ఎదురవుతున్నాయని ఈ నివేదిక హెచ్చరించింది.
చైనా ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే.. ఆ దేశ వృద్ధి రేటు 2025లో 5.0 శాతం నుండి 2026 నాటికి 4.4 శాతానికి, 2027 నాటికి 4.3 శాతానికి తగ్గే అవకాశం ఉందని అంచనా. ప్రభుత్వ సబ్సిడీల నిలిపివేత, ఇంధన దిగుమతి ధరల పెరుగుదల, రియల్ ఎస్టేట్ రంగంలో కొనసాగుతున్న సంక్షోభం, పెట్టుబడులను ప్రభావితం చేసే ఇతర అంతర్గత సవాళ్లు చైనా వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతాయని నివేదిక స్పష్టం చేసింది.

సానుకూల అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, సాంకేతిక రంగంలో పెరుగుతున్న పెట్టుబడుల వల్ల ప్రపంచ జిడిపి వృద్ధి 2026లో 2.9 శాతంగా, 2027 నాటికి 3 శాతంగా స్థిరంగా ఉంటుందని అంచనా వేయబడింది. ప్రస్తుత ఇంధన సంక్షోభం తాత్కాలికమేనని.. 2026 మధ్య కాలం నాటికి ధరలు అదుపులోకి వస్తాయన్న ఆశాభావంతో ఆర్థిక నిపుణులు ఈ అంచనాలను రూపొందించారు. అయినప్పటికీ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు గ్లోబల్ డిమాండ్ విషయంలో అనిశ్చితిని పెంచుతున్నాయని నివేదిక గుర్తుచేసింది.












Click it and Unblock the Notifications