ఈ వృద్ధ సంపన్నుడు మహా ప్రమాదకారి: జార్జ్ సోరస్‌పై జైశంకర్ ఘాటు వ్యాఖ్యలు
భారత ప్రధాని నరేంద్ర మోడీపై అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడిదారుడు జార్జ్ సోరస్ తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటుగా స్పందించారు.
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీపై అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడిదారుడు జార్జ్ సోరస్ తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే భారత ప్రభుత్వంతోపాటు బీజేపీ, ఇతర పార్టీలు కూడా జార్జ్ సోరస్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. భారతదేశంపై దాడిగా అభివర్ణించాయి. మా దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ హెచ్చరించాయి.

అదానీ వ్యవహారంలో మోడీ మౌనమంటూ జార్జ్ సోరస్
జర్మనీలోని మ్యూనిక్ భద్రతా సదస్సులో భాగంగా సోరస్ గురువారం ప్రసంగించారు. హిండెన్‌బర్గ్ నివేదిక అనంతరం స్టాక్ మార్కెట్‌లో అదానీ గ్రూప్ సంస్థలు భారీగా నష్టపోయిన విషయాన్ని ప్రస్తావించారు. అంతేగాక, మోడీ, అదానీ స్నేహితులని, వారి భవితవ్యం ఒకరితో మరొకరిది ముడిపడి ఉందన్నారు. అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్ సంబంధిత అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయని, ఆయన సంస్థల షేర్లు పేకమేడలా కూలిపోయాయని జార్జ్ సోరస్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో ప్రధాని మోడీ మౌనంగా ఉన్నారన్నారు.

భారత ప్రజాస్వామ్యంపై జార్జ్ సోరస్ వివాదాస్పద వ్యాఖ్యలు
అంతేగాక, విదేశీ పెట్టుబడిదారులు, పార్లమెంట్ నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాలన్నారు. గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యంలో ఇటీవల చెలరేగిన కల్లోలం భారత సర్కారుపై మోడీ పట్టును బలహీనపర్చే అవకాశముందన్నారు. దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కూడా అది తలుపులు తెరవొచ్చని 92ఏళ్ల సోరస్ వ్యాఖ్యానించారు. భారత్ ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ.. దాన్ని పాలిస్టున్న మోడీ మాత్రం ప్రజాస్వామ్యవాది కాదని విమర్శించారు. ఈ నేపథ్యంలో కేంద్రం, బీజేపీ, ఇతర పార్టీల నేతలు సోరస్ పై మండిపడ్డారు. భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు సోరస్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

జార్జ్ సోరస్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన జైశంకర్
తాజాగా, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఘాటుగా స్పందించారు. జార్జ్ సోరస్ ఒక వృద్ధుడైన బిలయనీర్. మూర్ఖమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తి. న్యూయార్క్‌లో ఉండే ఈ వ్యక్తి.. ప్రపంచం మొత్తం ఎలా పనిచేయాలో తన అభిప్రాయాలే నిర్ణయించాలని ఇంకా ఆలోచిస్తున్నాడు. ఇలాంటివారు తమకు కథనాలు రూపొందడంలో పెట్టుబడులు పెడుతుంటారు. వారు తమకు అనుకూల వ్యక్తి అధికారంలోకి వస్తే.. ఎన్నికలు సక్రమంగా జరిగాయంటారు. లేకపోతే అవకతవకలు జరిగాయని చెబుతారు. స్వేచ్ఛా సమాజం అనే నెపంతో ఈ వాదనలు చేస్తుంటారు అని జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications