మూడు పల్టీలు కొట్టిన స్కూల్ బస్
Scool Bus Accident: కేరళలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ స్కూల్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒక విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.
కేరళ కన్నూర్ జిల్లాలో ఈ ఘటన సంభవించింది. జిల్లాలోని చెంగాలయి పంచాయతీ పరిధిలో తాలిపరంబ- ఇరిట్టి జాతీయ రహదారిపై గల వలక్కై వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కురుంబత్తూర్‌లోని చిన్మయ విద్యాలయాకు చెందిన బస్సు అది. బుధవారం సాయంత్రం స్కూల్ ముగిసిన తరువాత విద్యార్థులను వాళ్ల ఇళ్లకు చేరవేయడానికి బయలుదేరింది.

మార్గమధ్యలో వలక్కై వద్దకు రాగానే మలుపులో అదుపు తప్పింది. అతి వేగంతో రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. బోల్తా కొట్టింది. హెయిర్ పిన్ బెండ్ వంటి మలుపు అది. ఒక వైపు రోడ్డు వద్ద బోల్తాపడిన బస్సు ఇంకో వైపు రోడ్డుపైకి వచ్చి పడిందంటే దాని వేగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనలో 18 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడ్డ వారిలో ఎనిమిది మందిని కన్నూర్ పరియారం ప్రాంతంలో గల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించారు. వారిలో నెధ్యా రాజేష్ అనే అయిదో తరగతి విద్యార్థిని అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. మరో 10 మందిని తాలిపరంబ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
భారత్ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద బస్ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 281 (ర్యాష్ డ్రైవింగ్), 125 (ఏ) (నిర్లక్ష్యం వల్ల ఇతరుల ప్రాణానికి హాని కలిగించడం), 106 (ఒకరి మరణానికి కారణం కావడం) వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications