లోక్ సభలో జమిలి బిల్లులకు ముహుర్తం ఫిక్స్-ఎన్నికలు మాత్రం అప్పుడేనన్న చంద్రబాబు..!
దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన కీలకమైన బిల్లుల్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్దమైంది. లోక్‌సభతో పాటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా తయారు చేసిన రెండు బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ఎల్లుండి సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. వీటిని ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
జమిలి ఎన్నికల నిర్వహణకు వీలుగా రాజ్యాంగానికి చేస్తున్న 129వ సవరణ బిల్లుతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లుకు ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో నిన్న ఈ బిల్లుల్ని ఎంపీలకు పంపించారు. ఈ ముసాయిదా బిల్లుల్లో సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌సభ తొలి సమావేశానికి రాష్ట్రపతి నోటిఫై చేయడానికి అపాయింటెడ్ తేదీ నుండి జమిలి ఎన్నికలు అమలులోకి వస్తాయి. అలాగే ఈ అపాయింట్ మెంట్ తేదీ తర్వాత ఎన్నికైన అన్ని రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలాలు లోక్‌సభ పూర్తి కాల వ్యవధితో పాటు ముగిసేలా తగ్గిస్తారు. దీంతో జమిలి ఎన్నికలకు మార్గం సుగమం అవుతుంది.

2024లో ఎన్నికైన లోక్‌సభ మొదటి సమావేశం ముగిసినందున, 2029 ఎన్నికలలో ఎన్నికైన సభ యొక్క తొలి సమావేశమే అప్పుడు అపాయింట్ మెంట్ తేదీగా గుర్తిస్తారని తెలుస్తోంది. అంటే 2034 నాటికి ఆ సభ పూర్తి కాలం ముగిసిన తర్వాత జమిలి ఎన్నికలు నిర్వహించవచ్చని సమాచారం. తాజా బిల్లుల ప్రకార లోక్‌సభ లేదా ఏదైనా రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ పూర్తి కాల వ్యవధి ముగిసేలోపు రద్దు అయితే, మిగిలిన ఐదేళ్ల కాలానికి ఆ అసెంబ్లీకి మాత్రమే మధ్యంతర ఎన్నికలు ఉంటాయి.
మరోవైపు జమిలి ఎన్నికలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం పార్లమెంట్ లో బిల్లులు పెట్టి జమిలి అమల్లోకి వచ్చినా..ఎన్నికలు జరిగేది మాత్రం 2029లోనే అన్నారు. ఒక దేశం-ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే తమ మద్దతు ప్రకటించామని చంద్రబాబు గుర్తుచేశారు. జమిలిపై అవగాహన లేని వైసీపీ ఏదేదో మాట్లాడుతోందన్నారు.












Click it and Unblock the Notifications