నిత్యానంద స్వామికే కాదు, మా సీఎంకు భక్తులు ఉన్నారు, సొంత పార్టీ లీడర్ సంచలనం !
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ మరోసారి విరుచుకుపడ్డారు. సీఎం సిద్ధరామయ్య మా రాముడు, అయోధ్యలో రాముడిని మేము ఎందుకు పూజించాలి అని కర్ణాటక మాజీ మంత్రి హెచ్ ఆంజనేయ చేసిన వ్యాఖ్యానించడంపై హరిప్రసాద్ స్పందించారు. సొంత పార్టీ ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఇచ్చిన కౌంటర్ కు సీఎం సిద్దరామయ్యతో పాటు ఆయన వర్గీయులు హడలిపోయారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కూడా కైలాసంలో నిత్యానంద స్వామీజీకి ఉన్నట్లుగా భక్తులు ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ హరిప్రసాద్ దుయ్యబట్టారు. గతంలోనూ హరిప్రసాద్ చాలాసార్లు సిద్ధరామయ్యపై పరుష పదజాలంతో, హేళనగా మాట్లాడారు. ఇప్పుడు నిత్యానంద స్వామీజీతో సీఎం సిద్దరామయ్యను పోలుస్తూ మరోసారి హరిప్రసాద్ జోక్ చేశారు.

అందరికీ భక్తులు ఉంటారు. కైలాస ఆశ్రమంలోని నిత్యానంద స్వామీజీకి కూడా చాలా మంది భక్తులు ఉన్నారు. అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కూడా చాలా మంది భక్తులున్నారు. దీన్ని అంత సీరియస్‌గా తీసుకోకూడదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ హరిప్రసాద్ అన్నారు. కరసేవక్ శ్రీకాంత్ పూజారి అరెస్టును సమర్థించిన హరిప్రసాద్ బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీపై కూడా కేసు ఉందని, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారందరినీ కరసేవకులు అనే కారణంతో తప్పించలేమని అన్నారు.
30 ఏళ్ల క్రితం నాటి కేసును ఇప్పుడు ఎందుకు తవ్వి తీశారనే ప్రశ్నేలేనే లేదని, అలాంటి వారిని ఇన్నాళ్లు నిర్బంధించకుండా వదిలేయడం పొరపాటు అని, తప్పులుంటే చర్యలు తీసుకోవాలని హరిప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్లే వారికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని, ఎందుకంటే, గోద్రా దుర్ఘటన లాంటిదేదో జరగొచ్చు అని, దీనిపై సమాచారం ఉంటుందని బీకే హరిప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇలా చెబుతున్నా అంటూ హరిప్రసాద్ సీరియస్ గా సమాచారం ఇచ్చారు. రామమందిర ప్రారంభోత్సవం ఇకపై మతపరమైన కార్యక్రమం కాదు. ఇదో రాజకీయ పరిణామంగా మారుతోంది. అది మతపరమైన కార్యక్రమం అయితే, మేము అందరం వెళ్ళేవాళ్లము. ఇది మతపరమైన కార్యక్రమం అయితే, మత పెద్దలు పాల్గొనవలసి ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ అన్నారు.












Click it and Unblock the Notifications